మమ్మల్ని ‘కారు’లో కూర్చోనివ్వండి!  

Share

తెలంగాణ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా కట్టకట్టుకుని తమనంతా టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని మండలి చైర్మన్‌స్వామిగౌడ్‌ను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాము గెలుపొందినప్పటికి ప్రజలంతా టీఆర్ఎస్ పక్షాన్నే ఉన్నందున మమ్మల్లి కూడా తెరాస శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు స్పష్టంచేశారు. మండలిలో తమ సీట్లను తెరాస సభ్యులతో పాటే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన తమను తెరాస పక్షంలో విలీనం చేయాలని నలుగురు ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలిత డిసెంబర్ 21న శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి లేఖ సైతం అందించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెరాస సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ప్రజల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతోనే తాము చేరతామని స్పష్టంచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయిందని  వారు వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, తెరాస పక్షంలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖకు విలువ లేదని, ఇలా లేఖ ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ను కలిసి  పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు.

పార్టీ ఫిరాయించిన ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని తాము గతంలోనే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. సీఎల్పీ సమావేశం నిర్వహించే అర్హత ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లకు లేదని, పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారితో సమావేశం ఎలా చెల్లుబాటవుతుందని, వారు చేసిన తీర్మానానికి ఎలా విలువ ఉంటుందని వారు అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న చైర్మన్ రాజ్యాంగాన్ని కాపాడాలని, గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరారు. స్పీకర్ సరిగా స్పందించకపోతే ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు.  ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా కారెక్కేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం.

 


Share

Related posts

నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు

sarath

శ్రీదేవి మృతి ప్రమాదం కాదంటున్న ఐపిఎస్!

Siva Prasad

ప్రతిపక్షం లేని సభలో బాబు విజన్!

Siva Prasad

Leave a Comment