ఉద్యోగాలు కాపాడుకోవటమా? కోల్పోవటమా?

(న్యూస్ ఆర్బి డెస్క్)

ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం(నవంబర్ 5) అర్ధరాత్రితో ముగియనుంది.  విధుల్లో చేరని కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోతే.. మిగిలిన ఐదువేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని.. అప్పుడిక తెలంగాణలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పలువురు కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు పలు డిపోలకు చేరుకొని అధికారులకు సమ్మతి పత్రాలను అందజేసి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మంగళవారం తుది గడువు కావడంతో ఎక్కువమంది చేరే అవకాశం ఉన్నది. ఐదోతేదీ అర్ధరాత్రి గడువు ముగిసేసరికి కార్మికులు విధుల్లో చేరకుంటే.. ఆ మర్నాడే మిగతా ఐదువేల రూట్లకు పర్మిట్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీరహితరాష్ట్రంగా మారుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని, విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 26 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరినవారిలోనూ కొందరు వెనక్కి వచ్చి సమ్మెలో పాల్గొంటున్నారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ తో భయపడొద్దని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్మికులు ధైర్యంగా ఉండాలని.. అంతిమ విజయం కార్మికులదేనని జేఏసీ నాయకులు చెప్పారు. కార్మికులెవ్వరూ యాజమాన్యానికి లేఖలు ఇవ్వొద్దని కోరారు. ఈ నెల 7న హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కార్మికులకు అనుకూలంగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిఇలా ఉంటే.. మంగళవారం ఉదయం విధుల్లోకి వెళుతోన్న నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్‌ జనార్దన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్పగాయాలు అయ్యాయి. అయితే, ఈ దాడిని ఆర్టీసీ జేఏసీ ఖండించింది. జనార్దన్‌పై దాడికి, ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. తాము నెల రోజులుగా శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నామన్నారు.