ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు బ్రేక్!

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై ప్రొ.విశ్వేశ్వరరావు అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు నిలిపివేయాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. దీంతో కేబినెట్ ప్రొసీడింగ్స్‌ను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆర్టీసీ కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. కేసు విచారణను సోమవారానికి(నవంబర్ 11) వాయిదా వేసిన హైకోర్టు… అప్పటి వరకు రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది.

ఆర్టీసీ సమ్మె కారణంగా 5,100 రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించి రవాణాశాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరకపోతే మిగతా 5,100 రూట్లను కూడా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో… దీనిపై హైకోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.