కార్మికులతో కెసిఆర్ ఆత్మీయ సమావేశం

హైదరాబాద్: ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్‌ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు వారిని పిలిచి మరీ భోజనాలు పెడుతున్నారు.

ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్యాహ్నం 12గంటలకు ఆర్‌టిసి కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు ఉండగా ప్రతి డిపో నుండి అయిదుగురు కార్మికులు  (వారిలో ఇద్దరు మహిళా ఉద్యోగినులు) సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ సమావేశంలో కార్మికులు పాల్గొనేందుకు ప్రతి జిల్లా నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది వరకూ కార్మికుల వరకూ ఈ సమావేశంలో పాల్గొంటుండగా వారితో ముఖ్యమంత్రి కెసిఆర్ కలిసి  భోజనం చేయనున్నారు. అనంతరం కార్మికులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. మొదటి నుండి యానియన్ నాయకత్వాన్ని తప్పుబడుతున్న కెసిఆర్ నేడు కార్మికులతో నేరుగా సంభాషించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. కార్మికులను తప్పుదోవపట్టిస్తున్నది పనికి మాలిన యూనియన్‌ నాయకత్వాలేనని కెసిఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇకపై ఆర్‌టిసిలో యూనియన్ నేతల హవా అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో కెసిఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే యూనియన్ నేతల ప్రమేయం లేకుండా కెసిఆర్ కార్మికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ‌ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.