ఆ గేమ్ ఆడారో… అరెస్టే!

రాజ్‌కోట్‌: మొబైల్ ఫోన్లలో పలువురు కలిసి ఆడే ప‌బ్‌జీ గేమ్ ను రాజ్‌కోట్‌ పోలీసులు వారం క్రితమే నిషేధించారు. తాజాగా ఆ గేమ్ ఆడుతున్నందుకు పది మందిని అరెస్టుచేశారు. వారిలో ఆరుగురు డిగ్రీ చదువుతున్న విద్యార్థులే. ఈ ఆటను నిషేధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ మనోజ్ అగర్వాల్ మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటివరకు దీనిపై 12 కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. ‘‘ఇది బెయిల్ ఇవ్వగల నేరమే. ఆడుతున్నవాళ్ల మీద కేసులు పెడుతున్నాం. వాళ్లను అరెస్టు చేసినట్లు చూపించినా, వెంటనే స్టేషన్ బెయిల్ మీదే పంపేస్తున్నాం. ఈ కేసులు కోర్టుకు వెళ్తాయి. అక్కడ విచారణ జరుగుతుంది’’ అని కమిషనర్ తెలిపారు.

రాజ్‌కోట్‌ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు బుధవారం నాడు పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ముగ్గురిని అరెస్టుచేశారు. వాళ్లంతా ప‌బ్‌జీ గేమ్ ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని ఎస్ఓజీ సీఐ రోహిత్ రావల్ తెలిపారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద, సెక్షన్ 35 కింద కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. విచారణ నిమిత్తం వాళ్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువకులంతా ఆటలో పూర్తిగా మునిగిపోయారని, వాళ్ల వద్దకు పోలీసులు వస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదని రావల్ అన్నారు. అరెస్టయిన వారిలో ఒకరు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా మరొకరు రోజుకూలీ. మూడో వ్యక్తి డిగ్రీ చదివి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. మంగళవారం ఆరుగురు కాలేజి విద్యార్థులను పోలీసులు అరెస్టుచేశారు.

ప‌బ్‌జీ, మోమో చాలెంజ్ ఆటలను నిషేధిస్తూ మార్చి 6న పోలీసు కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప‌బ్‌జీ యువతకు బాగా అలవాటు అయిపోతుంటే, మోమో చాలెంజ్ యువతలో హింసాత్మక ధోరణిని పెంచుతోంది. ప్రజాభద్రతన దృష్టిలో పెట్టుకునే వీటిపై నిషేధం విధించినట్లు కమిషనర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకే ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు కమిషనర్ అగర్వాల్ తెలిపారు. ఇంతకుముందు బ్లూవేల్ చాలెంజ్ మీద కూడా ఇలాగే నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.