సరిహద్దులో టెన్షన్..టెన్షన్!

పుల్వామా టెర్రర్ దాడికి ప్రతిగా భారత యుద్ధవిమానాలు జరిపిన మెరుపు దాడి దరిమిలా జమ్ము కాశ్మీర్ సరిహద్దులో బుధవారం యుద్ధ వాతావరణం నెలకొన్నది. పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రజల్లో మొదలయింది. పాక్ గగనతలం దాటిన భారత్ యుద్ధవిమానాలపై తమ జెట్ ఫైటర్స్ దాడి చేసి ఒక విమానాన్ని కూల్చి వేశాయని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. వెంటనే భారత్ సైన్యం ఆ వార్తను ఖండించింది. భారత వాయుసేన పైలట్లు అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది.

పాక్ యుద్ధవిమానాలు మధ్యాహ్నం నౌషేరా సెక్టార్‌లో భారత్ గగనతలాన్ని అతిక్రమించాయి. వెంటనే భారత వాయుసేన ఫైటర్ జెట్ విమానాలు వాటిని తిప్పి కొట్టినట్లు తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్‌లో మధ్యాహ్నం భారత్ వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ 17 రవాణా హెలీకాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు మృతిచెందారు. లామ లోయ ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్16 యుద్ధవిమానం కూలిపోయినట్లు వార్తలు వచ్చాయి. కూలడానికి కారణం మాత్రం తెలియరాలేదు.

పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య శ్రీనగర్, జమ్ము, లె విమానాశ్రయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం నుంచీ పాక్ సేనలు సరిహద్దులో మోర్టార్ దాడులతో కాల్పుల విరమణ ఉల్లంఘనలు చేస్తూనే ఉన్నాయి.

ప్రధాని మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మెరుపుదాడుల పర్యవసానాలపై ఈ సమావేశంలో సమీక్ష జరుపుతున్నారు. భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, ఉన్నత సైనికాధికారులు, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ సమావేశానికి హాజరయ్యారు.