థాయ్ లాండ్ రాజుగా మరికొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మహా వజిరలోంగ్ కార్న్.. ఉన్నట్టుండి తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగం ఉప అధిపతి అయిన మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరును క్వీన్ సుతిద అని మార్చారు. థాయ్ రాయల్ గెజిట్ ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు వారి పెళ్లి దృశ్యాలను, చిత్రాలను కూడా విడుదల చేయడంతో ఒక్కసారిగా థాయ్ లాండ్ ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ల పెళ్లి దృశ్యాలను థాయ్ టీవీ చానళ్లన్నింటిలో ప్రసారం చేశారు.
2016లో మహా వజిరలోంగ్ కార్న్ తండ్రి కింగ్ భుమిబోల్ అదుల్యదేజ్ మరణించారు. అప్పటికి ఆయన సింహాసనంపై 70 ఏళ్లు ఉన్నారు. అప్పుడే పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మహా వజిరలోంగ్ కార్న్ పేరు కింగ్ రామా పది (ఎక్స్)గా మారనుంది. శనివారం ఆయనను అధికారికంగా బౌద్ధ, బ్రాహ్మణ సంప్రదాయ కార్యక్రమాల అనంతరం సింహాసనాధీశుడిని చేస్తారు. ఆ తర్వాతి రోజు బ్యాంగ్ కాక్ లో పెద్ద ప్రదర్శన ఉంటుంది. మహా వజిరలోంగ్ కార్న్ కు గతంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ముగ్గురి నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. ఆ ముగ్గురు భార్యలతో ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు.
సుతిద టిడ్జాల్ విషయానికి వస్తే, థాయ్ ఎయిర్ వేస్ లో ఫ్లయిట్ అటెండెంట్ గా పని చేస్తున్న ఆమెను 2014లో మహా వజిరలోంగ్ కార్న్, తన బాడీగార్డుల్లో డిప్యూటీ కమాండెంట్ గా నియమించుకున్నారు. సుతిదాను విమానంలో చూసి మనసు పారేసుకున్న మహా వజిరలోంగ్ కార్న్, ఆమెను ఇన్నాళ్లూ తన పక్కనే పెట్టుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ రాయల్ ప్యాలెస్ మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.
2016 డిసెంబరు నెలలో సుతిదాను రాయల్ థాయ్ ఆర్మీలో పూర్తిస్థాయి జనరల్ చేశారు. 2017లో రాజు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి డిప్యూటీ కమాండర్ చేశారు. ఆమెకు తాన్ పుయింగ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. తన తండ్రి మరణించిన వెంటనే బాధ్యతలు స్వీకరించినా, పట్టాభిషేకానికి మాత్రం సమయం పట్టింది. భుమిబోల్ రాజును ఆయన మరణించిన ఏడాది తర్వాత ఖననం చేశారు.