టాప్ స్టోరీస్

ప్రాణం కోసం కాలు కోసేసుకున్నాడు

Share

ప్రాణాలు కాపాడుకున్న అమెరికా రైతు
ప్రాణాలను కాపాడుకోడానికి జేబులో ఉన్న పాకెట్ నైఫ్ తో కాలు కోసేసుకున్నాడో అమెరికా రైతు! ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన గురించి.. తృటిలో ప్రాణాపాయం బయటపడిన తన వైనం గురించి ఆ తర్వాత ఆయనే ‘ద వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు ఫోన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు. ఈశాన్య నెబ్రాస్కా ప్రాంతంలోని తన పొలంలో ఆయన మొక్కజొన్నలను కోసే యంత్రంతో పనిచేస్తున్నారు. అందులో ఉన్న బ్లేడు అప్పటికే శరవేగంగా తిరుగుతూ మొక్కజొన్న గింజలను వేరు చేసి అక్కడే ఉన్న పెద్ద పాత్రలో వేస్తోంది. అటువైపుగా వెళ్లిన కర్ట్ కేజర్ (63).. పొరపాటున అందులో కాలు పెట్టారు. ఆ విషయం ఆయన గుర్తించేలోపే కార్క్ స్క్రూలా ఉండే బ్లేడు ఆయన పాదాన్ని లోపలకు లాగేసుకుంది. అప్పటికే అది నలిగిపోతోంది. ఇంకా మొత్తం శరీరాన్ని లోపలకు లాగేసుకోడానికి మిషన్ ప్రయత్నిస్తోంది. ఏదో తేడా జరుగుతోందని తనకు తాను చెప్పుకొన్నానని ఆయన అన్నారు. తొలుత నేల మీద పడుకుండిపోయి, తన కాలును బయటకు లాగేందుకు ప్రయత్నించానన్నారు. కానీ అది రాలేదు. దాంతో ఎవరినైనా సాయం కోసం పిలుద్దామనుకున్నారు. పొలంలో ఆయన అప్పటికి ఒంటరిగా ఉన్నారు. జేబులో సెల్ ఫోన్ ఉందేమోనని చూస్తే లేదు.

ఏం చేయాలో అర్థం కాలేదు.. దాంతో జేబులో చూసుకుంటే పాకెట్ నైఫ్ ఒకటి చేతికి తగిలింది. దాని సాయంతో కష్టపడి ఎలాగోలా కాలిని మోకాలి కిందవరకు కోసేసుకున్నారు. దాంతో ఆయన ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన జరిగేవరకు కాజర్ చాలా మంచి రైతు. తన 1500 ఎకరాల పొలంలో ఆయనొక్కరే పనిచేసుకునేవారు. ఏప్రిల్ 19వ తేదీన మొక్కజొన్న కోయడానికి వెళ్లినపుడు ఈ దారుణ ఘటన జరిగింది. సాధారణంగా ఆ యంత్రంలోని బ్లేడు మీద వైరు మెష్ ఉంటుంది. కానీ శీతాకాలంలో అది ఉంటే పనికి ఇబ్బంది అవుతుందని దాన్ని కొంత మేర కేజర్ కత్తిరించారు. దాంతో అక్కడ కాలుపెట్టి పనిచేస్తుండగా కాలుజారి, సరిగ్గా బ్లేడు మీదకు పడింది.

అప్పుడు అలాంటి సమయంలో తనకు నొప్పి విషయం ఏమీ గుర్తుకు రాలేదని, ప్రాణాలు కాపాడుకోడానికి తన కాలు తాను కోసేసుకోవడం తప్ప మరో మార్గం ఏమీ కనపడలేదని తెలిపారు. ఆ సమయంలో భయం కూడా ఏమీ వేయలేదన్నారు. తాను తప్పు చేసినట్లు తెలిసింది కాబట్టి.. దాన్నుంచి బయటపడటమే తన ముందున్న లక్ష్యం అనిపించిందన్నారు. మిషన్ నుంచి బయటపడిన తర్వాత అక్కడకు వంద అడుగుల దూరంలో ఉన్న తన ఆఫీసుకు పాక్కుంటూ వెళ్లి తన కొడుక్కి ఫోన్ చేశారు. వెంటనే నెబ్రాస్కాలోని బ్రయాన్ ట్రామా సెంటర్ వాళ్లు హెలికాప్టర్ ద్వారా ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కుమార్తెలలో ఒకరు ట్రామా నర్సుగా పనిచేస్తున్నారు. కాలు కోసుకుని, నేల మీద పాక్కుంటూ వెళ్లడం వల్ల గాయం తీవ్రత పెరిగిందని, దాంతో తాము యాంటీ బయాటిక్స్ చాలా ఎక్కువగా ఇచ్చి వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని ట్రామా సర్జన్ స్టాన్లీ ఒకోసున్ చెప్పారు. తన 15 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదన్నారు. అతడే సొంత 911గాను, సొంత ఆసుపత్రిలా, సొంత సర్జన్ లా వ్యవహరించాడని కేజర్ గురించి చెప్పారు. అతడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడని, దాంతో అతడికి చికిత్స చేయడం తమకు చాలా సులభం అయ్యిందని అన్నారు. అతడి మనోధైర్యం చాలా అద్భుతమని ప్రశంసలు కురిపించారు.

వారం పాటు ఆసుపత్రిలో, మరో రెండు వారాలు రీహాబిలిటేషన్ సెంటరులో ఉన్న తర్వాత కేజర్ ఇప్పుడు ఇంట్లో కోలుకుంటున్నారు. ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత అతడికి కృత్రిమ కాలు అమరుస్తారు. తన చరిత్ర అందరికీ ఎలాగోలా ఉపయోగపడుతుందని కేజర్ తెలిపారు. ప్రమాదంలో ఉన్నప్పుడు కంగారు పడకూడదని, నెమ్మదిగా ఆలోచించాలని సూచించారు. కాసేపు తనకు నిరుత్సాహం అనిపించిందని, తర్వాత ప్రాణాలు దక్కినందుకు, మళ్లీ నడవగలిగే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

కర్ట్ కేజర్ ఏమంటున్నాడో వినండి:

Video Courtesy: Associated Press


Share

Related posts

మసూద్ అజర్…గ్లోబల్ టెరరిస్ట్!

Siva Prasad

మాజీ జడ్జిపై కేసు నమోదు..! తమిళనాడులో ముదిరిన వివాదం..!!

somaraju sharma

మళ్లీ సుప్రీంను ఆశ్రయించిన నిర్భయ దోషి!

Mahesh

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar