ఆర్టీసీ వాస్తవాలేమిటి?

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనీ టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాస్తవాలు ఇవీ అంటూ టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా ఆర్టీసీ సమ్మెపై ఓ ట్వీట్ పెట్టింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్టీసీని ఆదుకునేందుకు జరిగిన ప్రయత్నాలను వివరించింది. ఈ ట్వీట్‌లో టీఆర్ఎస్ పార్టీ కొన్ని విషయాలు పాయింట్ల రూపంలో ఇచ్చింది. 2009-10 నుంచీ 2013-14 వరకూ సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.712 కోట్ల కేటాయింపు జరగ్గా… 2014-15 నుంచీ ఇప్పటివరకూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి రూ.4,253 కోట్లు ఇచ్చినట్లు ట్వీట్‌లో తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన నిధులు 600 శాతం పెరిగితే… ఏమీ ఇవ్వలేదని ఉద్యోగులు అసత్యాలు చెబుతున్నారన్నట్లుగా ట్వీట్ చేసింది. అలాగే, తెలంగాణ వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు 67 శాతం పెరిగాయని, చట్టవిరుద్ధమైన సమ్మె జరిపిస్తూ కార్మికుల జీవితాలతో యూనియన్లు చెలగాటం ఆడుతున్నాయని విమర్శించింది.

ఇటీవల అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత కె.కేశవరావు ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని… ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదని కేకే పేర్కొన్నారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని.. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విఙ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 16 రోజులుగా సాగుతూనే ఉంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు రోజుకో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెని ఉదృతం చేయాలనీ భావిస్తుంది. సమ్మె మొదలై 16 రోజులు పూర్తైనా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం, హైకోర్టు సూచనల్ని కూడా పక్కన పెట్టి, చర్చల అంశాన్ని అటకెక్కించడంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు.