తెలుగు రాష్ట్రల మధ్య డేటా ఘర్షణ!

డేటా చోరీ కేసు రోజు రోజుకు జటిలమవుతున్నది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఈ వివాదం మరింత ముదురుతున్నది. మాటల యుద్ధం కాస్తా కేసుల వరకు వెళ్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యహారంలో విచారణను వేగవంతం చేసేందుకు నిర్ణయించుకుంది. విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ టిడిపి టిఆర్ఎస్ పోలీసులపై  పోలీసు కేసు పెట్టింది. రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ నాయకులదరూ వెంట రాగా గుంటూరు రూరల్ ఎస్‌పి దగ్గరకు బుధవారం సాయంత్రం వెళ్లి పిర్యాదు ఇచ్చారు. టిడిపికి చెందిన డేటాను తెలంగాణా పోలీసులు, వైసిపి నాయకులు, మరి కొందరు రాజకీయ నాయకులూ కలిసి కుట్ర పన్ని చోరీ చేశారన్నది ఫిర్యాదు సారాంశం. ఆ డేటా ఆధారంగా వైసిపి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల వోట్లు తొలగించేందుకు దరఖాస్తులు పెడుతున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎపి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. తెలంగాణ సర్కార్ డేటా చోరీ చేసి వైసిపికి ఇస్తున్నదని ఎపి సర్కార్ ఆరోపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించుకున్నది.

మరోవైపు ఈ వ్యవహారంలో ఎపి ప్రతి పక్ష నేత,వైసిపి అధినేత జగన్ గవర్నర్‌ను కలిసి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఎపి బిజెపి నేతలు సైతం ఈ అంశంపై గవర్నర్‌ను కలిశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చనీయాంశం అయిన ఈ వివాదం లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తెరమీదకొచ్చింది. ఐటి గ్రిడ్ అనే ప్రయివేటు సంస్థ దగ్గర ఎపి ప్రజల డేటా ఉంది అనేది ఆయన ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అంశం.

ఈ సంస్థ హైదరాబాద్‌లో ఉంది. లోకేశ్వర్ రెడ్డి కూడా అక్కడే ఫిర్యాదు చేశారు. దీంతో టి-సర్కార్ ఈ కేసులో వేగంగా చర్యలు తీసుకుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగానే టిడిపి నేతలు మా డేటాపై మీ దర్యాప్తు ఏమిటి అని విమర్శలకు దిగారు.

టిఆర్‌ఎస్, వైసిపి పార్టీలు చంద్రబాబు ప్రభుత్వ డేటాని పార్టీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. టిడిపి ఈ విమర్శలను తిప్పి కొడుతున్నది.  టిడిపికి చెందిన సేవామిత్ర యాప్‌లోని డేటా టిఆర్‌ఎస్ ప్రభుత్వం చోరీ చేసి వైసిపికి ఇచ్చిందని ఆ పార్టీ నాయకులు  ఆరోపిస్తున్నారు.