నో బ్యాక్ స్టెప్.. కేసీఆర్ వ్యూహమేంటి?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తారా స్థాయికి చేరింది. కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. దాదాపు అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు బస్సు డిపోల వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చేసిన సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని కోర్టు సూచించగా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు కనిపించడం లేదు. నిజానికి కోర్టు సూచనతో శుక్రవారం రాత్రే కేసీఆర్ ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే, ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ ఆలోచన ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ కోర్టు సూచన మాత్రమే చేసిందని, ఆదేశాలు కాదని, కాబట్టి అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని అధికారులతో కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. అంతేకాక, విచారణను ఈ నెల 28 వరకు వాయిదా వేసిందని, కాబట్టి అప్పటి వరకు సమ్మెపై ఆలోచించకపోయినా పర్వాలేదని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. కోర్టు సూచనను కేసీఆర్ లైట్ తీసుకోవడం వల్లే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు చర్చలకు సంబంధించిన ఆహ్వానం వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెను నిర్వీర్యం చేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంద్ సందర్భంగా వివిధ ప్రదేశాల్లో ఆందోళన చేస్తున్న రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కార్మికుల మద్దతు తెలపడానికి వెళ్లిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సహా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్‌భవన్‌ వద్దకు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు తరలి వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్సుభవన్‌ లోపలికి ఇతరులు ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఆర్టీసీ ఉద్యమంలో ప్రజలంతా ఒక్కొక్కరుగా భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేసి సర్కార్‌కు తమ సత్తా ఏంటో చాటాలని ఆర్టీసీ భావిస్తోంది. అయితే, ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని చెబుతున్న సీఎం కేసీఆర్.. ఎలాంటి వ్యూహాంతో ముందుకు వెళ్తున్నారో అంతుచిక్కడం లేదు. అంతేకాదు బంద్ ప్రభావం లేదని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం.