డెడ్​లైన్ ఎఫెక్ట్: విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతున్న వేళ.. పలువురు కార్మికులు వీధుల్లో చేరారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు డ్రైవర్లు, నలుగురు కండక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ మేనేజర్లు, ఒక రికార్డు ట్రేసర్, ఒక మెకానిక్ ఇలా మొత్తం 16 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు. భద్రాచలం, ఉప్పల్‌, కామారెడ్డి, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌ లలో కార్మికులు విధుల్లో చేరేందుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ మంగళవారం(నవంబర్ 5) అర్ధరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరింత ఉద్యోగులు విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ ఖదీర్… రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు డ్యూటీలో చేరుతున్నట్లు ప్రకటించారు. డీవీఎం నాగేశ్వర్ రావుకు ఇచ్చిన దరఖాస్తులో ఆయన పేర్కొన్నారు. రిక్వెస్ట్ లెటర్ ను ఉన్నతాధికారులకు పంపించినట్లు డీవీఎం తెలిపారు. ఇక కోరుట్ల ఆర్టీసీ డిపోలో యం. సంధ్యారాణి అనే మెకానికల్ ఫోర్ మెన్ డ్యూటీలో జాయిన్ అయ్యారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ఆమె విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సమ్మె విరమించుకొని బేషరతుగా ఉద్యోగంలో చేరుతున్నట్లు అధికారులకు రాసిన లేఖలో సంధ్యారాణి పేర్కొన్నారు.

పలు చోట్ల ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో ఒక్కక్కరుగా చేరుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు తాము డిసైడ్ చేసిన కార్యాచరణ అమలు చేసిన జేఏసీ నేతలు.. ముఖ్యమంత్రి ప్రకటన తరువాత  కార్మికుల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది ? అనే విషయం తెలుసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ డెడ్ లైన్ పైన కార్మికుల అభిప్రాయాలు తెలుసుకొనేందకు అన్ని డిపోల కార్యదర్శులతో టీయస్ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమావేశం అవుతున్నారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ 26 డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేస్తున్న సమ్మె 31వ రోజుకు చేరింది. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి లేదని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించింది. దీంతో కొందరు ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికీ సెప్టెంబర్ జీతాలు అందలేదు. అక్టోబర్  నెల కూడా పూర్తయింది. ఆర్దిక ఇబ్బందులు..మానసిక సంఘర్షణతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇక, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించే అవకాశం లేదనే విషయం స్పష్టమైంది. దీంతో కొందరు కార్మికులు జేఏసీ నేతల మాటలు కాదని..నేరుగా డిపోల్లోకి వెళ్లి లేఖలు ఇచ్చి విధుల్లో చేరుతున్నారు.

అయితే, ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తీసేసే అధికారం ఎవ్వరికీ లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి చెబుతున్నారు. చర్చల ద్వారా పరిష్కారం చేయకుండా డెడ్​లైన్​ విధించడమేమిటని సీఎం కేసీఆర్​ను ప్రశ్నించారు. డ్యూటీల్లో జాయిన్​ అయ్యి ఆత్మద్రోహం చేసుకోవద్దని, పోరాటంలో భాగస్వాములు కావాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఇదిఇలా ఉంటే.. విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే స్థానికంగా ఉండే స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.