ఆర్టీసీ సమ్మె.. నెక్ట్స్ ఏంటి?

హైదరాబాద్: ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకుల కీలక భేటీ జరిగింది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం(నవంబర్ 9) ట్యాంక్ బండ్‌పై తలపెట్టిన సర్వజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తమైన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. సమావేశానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్దితోపాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క, వీహెచ్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వామపక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ట్యాంక్‌బండ్‌పై పరిణామాలు, రేపు హైకోర్టులో వాదనలు, భవిష్యత్తు కార్యాచరణ, విపక్షాల మద్దతు సమీకరణ వంటి అంశాలపై నాయకులు కూలంకుషంగా చర్చించారు. ప్రభుత్వం దిగిరాకపోతే.. జైల్ భరో, రోడ్ల దిగ్బంధనంతోపాటు మరికొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ యోచన చేస్తున్నట్లు సమాచారం.

ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదివారం మరోసారి ప్రగతిభవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైకోర్టులో రేపటి విచారణలో వ్యవహరించాల్సిన తీరుపై సమీక్షించనున్నారు. టీఎస్‌ఆర్టీసీ ఆవిర్భావ కారణాలను హైకోర్టుకు ప్రభుత్వం వివరించాలనుకుంటోంది. రూట్ల ప్రైవేటీకరణను సమర్థించేలా సర్కారు వాదనలు వినిపించనునుంది. ఒకవేళ హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను కోర్టు కోరడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది. శనివారం ట్యాంక్ బండ్ వద్ద మిలియమ్ మార్చి నిర్వహించిన కార్మికులు.. ఇవాళ అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతున్నారు.