‘సమ్మె ఇంకా ఉధృతం చేయకతప్పదు’!

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెని ఉదృతం చేయాలనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భవిష్య కార్యచరణ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం దమనకాండను ఆపాలని, హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలన్నారు. న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావుపైనా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె భవిష్యత్‌ కార్యాచరణ, వ్యూహాలపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్షం, ఆర్టీసీ జాక్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అశ్వత్థామరెడ్డి ఈ నెల 21 నుంచి 30 వరకు చేపట్టే కార్యాచరణను వివరించారు.

ఈ నెల 21వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఆర్టీసీ కుటుంబాలతో బైఠాయింపు ఉంటుందన్నారు. 22వ తేదీన తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లకు ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టవద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు. 23వ తేదీన ప్రజా ప్రతినిధులతో ములాఖత్ ఉంటుందని తెలిపారు. 24వ తేదీన మహిళా కండక్టర్లంతా ఆర్టీసీ డిపోల ఎదుట దీక్షలు చేపడుతారని చెప్పారు. 25వ తేదీన హైవేలపై బైఠాయించి దిగ్భంధం చేస్తామన్నారు. 26వ తేదీన ఆర్టీసీ కుటుంబాల పిల్లలతో దీక్షలు చేపడుతామని తెలిపారు. 30న సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆర్టీసీ పోరాటాన్ని ఆపేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ డిమాండ్ల కోసం ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మబలిదానం చేసుకోగా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఖాజామియా అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. 15 రోజుల నుంచి ఆయన ఆర్టీసీ సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చుతున్నా.. ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు. సీఎం కేసీఆర్ ఇకనైనా మొండివైఖరి వీడి ఆర్టీసీతో చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఓయూ జేఏసీ అక్టోబర్ 23న ఉస్మానియా క్యాంపస్‌లో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభలో ఆర్టీసీ జేఏసీ నేతలు పాల్గొననున్నారు. కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు అక్టోబరు 5 నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెలో భాగంగా శనివారం తెలంగాణ బంద్‌ను పాటించగా, దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపి విజయవంతం చేశాయి. సమ్మె విషయంలో హైకోర్టు చేసిన సూచనలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్మిక సంఘాలు మండిపడతున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మె యథాతథంగా కొనసాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది.