తిరుపతిలో మద్యం బంద్ సబబేనా!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

రెండు రోజుల క్రితం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) పాలకమండలి సమావేశంలో ఒక ఆసక్తికరమైన తీర్మానం చేశారు. తిరుపతి నగరంలో కూడా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆ తీర్మానంలో కోరారు.

దీనిపై తిరుపతి ప్రజల్లో కాస్త చర్చ జరిగింది, దానంతటదే ముగిసిపోయింది. ఆ..ఇది అయ్యేదా పొయ్యేదా ఆని అనుకున్నట్లున్నారు. అయితే అలా తేలికగా కొట్టేసే విషయం కాదు ఇది. ఆ విషయం ఎవరికైనా అర్ధం అయిందో లేదో కానీ సిపిఐ రాష్ట్రకార్యదర్శివర్గం సభ్యుడు పి. హరినాధరెడ్డికి మాత్రం స్పష్టంగా అర్ధమయింది.

టిటిడి ఆ విధంగా రాష్ట్రప్రభుత్వానికి సిఫారసు చేయడం ప్రజల వ్యక్తిగత అభిప్రాయాలలో, అభిరుచుల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడమేనని ఆయన అన్నారు. ఈరోజు మద్యం దుకాణాలు మూసేయాలంటారు. రేపు మాంసం దుకాణాలు మూసేయాలంటారు. ఇలా కోరేందుకు టిటిడికి ఉన్న హక్కేమిటి అని ఆయన ప్రశ్నిచారు.

తిరుమల వెంకటేశ్వరుడి దగ్గరకు వెళ్లాలంటే తిరుపతి వెళ్లాల్సిందే కాబట్టి ఆ నగరానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. అంత మాత్రాన అది రాష్ట్రంలోని మిగతా పట్టణాలకూ నగరాలకూ ఏమాత్రం భిన్నం కాదు. అక్కడ కూడా జనం పుడతారు, గిడతారు. ఈ మధ్యలో జీవన వ్యాపారాల్లో మునిగి తేలుతుంటారు. పెళ్లిళ్లు చేసుకుంటారు. పిల్లలను కంటారు. తమతమ అభిరుచుల ప్రకారం కావాల్సిన సుఖ సంతోషాలను పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆహార పానీయాలు కూడా అందులో భాగమే. తిరుపతిలో నివసిస్తున్న కారణంగా అక్కడి వారికి మిగతా రాష్ట్ర ప్రజలందరికీ లభ్యమవుతున్న మద్యం దొరకనీయకుండా చేయడం ఎలా చూసినా సబబు కాదు.

ఈ విధంగా డిమాండ్ చేసేందుకు టిటిడికి ఉన్న అధికారమేమిటని హరినాధరెడ్డి వేసిన ప్రశ్న సహేతుకమే. నిజానికి ఇలాంటి చర్య చట్టబద్ధం కాదు. చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం లభిస్తున్నంత కాలం అది తిరుపతి అయినా సరే సరఫరా ఆపడం కుదరదు. తిరుమల నోటిఫైడ్ ఏరియా కాబట్టి అక్కడ టిటిడి ఏం చెబితే అదే చెల్లుబాటవుతుంది. మరెక్కడా కూడా అది కుదరదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమేణా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానంటున్నారు. అది సాధ్యమేనా అన్న మీమాంస పక్కనపెడితే, అలా చేసిన నాడు అంతటా అమలయిన మద్యనిషేధం తిరుపతిలో కూడా అమలవుతుంది. మద్యపానం హక్కు కింద కోరడం కుదరదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాబట్టి ప్రభుత్వాలు మద్యనిషేధం అమలు చేస్తే ప్రజలు మద్యపానం మానుకోవడం మినహా గత్యంతరం లేదు.

ఆ అంశాల దృష్ట్యా ఒక్క తిరుపతి నగరంలో మద్యనిషేధం అమలు చేయడం కుదరదు. అయితే టిటిడి పాలకమండలి సభ్యులకో, అధికారులకో ఈ విషయం తెలియదనుకోలేం. తెలిసీ ప్రభుత్వానికి ఆ తీర్మానం పంపడం పట్ల ప్రజలకు అభ్యంతరం ఉండాలి. అది మద్యం అలవాటు లేనివారయినా సరే. ఎందుకంటే ప్రజల వ్యక్తిగత జీవితాల్లో చొరబడే హక్కు టిటిడికి లేదు. ఆ లేని హక్కును ఒకసారి ఇస్తే ఇక దానికి అంతుండదు.