ఏపీలో ఆగని అఘాయిత్యాలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా… మానవ మృగాలు మాత్రం మారడం లేదు. తాజాగా గుంటూరులో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి కొలనుకొండలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలోనే ఈ ఘోరం బయటపడింది. కొలనుకొండలో సయ్యద్ ఖాసీంవలి అనే వ్యక్తి ఉర్దూలో హోమ్ ట్యూషన్ చెబుతున్నాడు. అతడి ఇంటికి ట్యూషన్ కోసం వచ్చిన బాలికకు మాయ మాటలు చెప్పి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడు. గత ఆరు నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. ఈ విషయం బయటకు రావడంతో కొంతమంది పెద్దల సహకారంతో రాజీ చేసే ప్రయత్నం చేశారు. అనంతరం బాలికను గుంటూరు జిల్లా ఎడ్లపాడు హాస్టల్ కు తరలించారు.

అయితే హాస్టల్‌కు వెళ్లిన బాలికను ఆ కామాంధుడు వదల్లేదు. ఖాసీం తన భార్య సహకారంతో బాలికను హాస్టల్ నుంచి మరల ఇంటికి పిలిపించి బాలికను మూడు రోజులుగా తన నివాసంలో బంధించి భార్య సహకరంతోనే అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిండుతుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా, మహిళల భద్రతకు ఉద్దేశించిన ఏపీ దిశ చట్టం ఇటీవలే ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది.