న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక మందగమనాన్ని బాలీవుడ్ సినిమాల కలెక్షన్లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు మూడు బాలీవుడ్ చిత్రాలు రూ.120 కోట్లు వసూలు చేశాయన్న తన వ్యాఖ్యలు వాస్తవానికి కరెక్టేనని ఆయన పేర్కొన్నారు.
My comments made yesterday in Mumbai about 3 films making ₹120 Cr in a single day- the highest ever, was a factually correct statement. I had stated this as I was in Mumbai- the film capital of India. …(1/4) pic.twitter.com/RL62YhjpZt
— Ravi Shankar Prasad (@rsprasad) October 13, 2019
‘మూడు సినిమాలు రూ.120 కోట్లు వసూలు చేయడం రికార్డని నేను చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. ముంబైలో నేను ఈ మాటలు చెప్పాను. లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, గణనీయంగా పన్నులు చెల్లిస్తున్న చిత్ర పరిశ్రమను అభినందించేందుకే నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను. ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం మోదీ సర్కార్ తీసుకుంటున్న పలు ప్రజానుకూల నిర్ణయాలను కూడా సవిస్తారంగా ప్రస్తావించాను. సామాన్య ప్రజల క్షేమం కోసం మోదీ నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటారు. నేను మాట్లాడిన మొత్తం వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. అయినప్పటికీ నా ప్రకటనలోని ఒక భాగాన్నే తీసుకుని ట్విస్ట్ చేశారు. ఒక సున్నిత మనస్కుడిగా ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను’ అని రవిశంకర్ ప్రసాద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం ముంబై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్థిక సంక్షోభం వార్తలను తోసిపుచ్చుతూ, అక్టోబర్ 2న విడుదలైన మూడు బాలీవుడ్ సినిమాలు ఒకరోజులోనే రూ.120 కోట్లు వసూళ్లు వచ్చాయని, అలాంటప్పుడు ఆర్థిక మందగనమం అనే ప్రశ్న ఎక్కడిదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు ఎలెక్ట్రానిక్స్ పరిశ్రమ, తయారి పరిశ్రమ, ఐటి ఇండస్ట్రీ, ముద్ర ఋణాలు, వాణిజ్యం, సేవల విభాగాలు చక్కగానే పనిచేస్తున్నాయని ఉటంకించారు. అదికాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలో భారత్ ప్రపంచంలో 11 వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఫ్రాన్స్ ను సైతం తలదన్ని ప్రపంచ స్థాయిలో ఐదవ ఆర్ధిక శక్తిగా నిలిచిందని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి ప్రకటనపై కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. నెటిజెన్ల నుంచి సైతం రవిశంకర్ ప్రసాద్ విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.