అమెరికా అధ్యక్షుడి ఆకస్మిక నిర్ణయం
వాషింగ్టన్: వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ విధానాల విషయంలో అమెరికా అధ్యక్షుడిని సమర్ధించిన హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి కిర్ స్టెన్ నీల్సన్ రాజీనామా చేశారు. ఒక రకంగా ఆమెను ట్రంప్ బలవంతంగానే పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా డొనాల్డ్ ట్రంపే ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల నుంచి భారీ సంఖ్యలో వలసలు వస్తున్నాయని, అందుకు ఆమే కారణమని ట్రంప్ ఇటీవల ఆరోపించారు. తన విధానాలను కచ్చితంగా అమలుచేయడానికి కావల్సినంత కఠినంగా ఆమె ఉండట్లేదన్నారు. అక్రమ వలసలు, ఆశ్రయం కోరేవారిని ఉద్దేశించి ఇటీవల మెక్సికో సరిహద్దులలో ట్రంప్ ఒకే మాట చెప్పారు.. ‘‘మా దేశం నిండిపోయింది’’. అప్పుడు అదే సమయంలో నీల్సన్ కూడా అక్కడే ఉన్నారు.
వలసల నిరోధానికి కాంగ్రెస్, మధ్య అమెరికా ప్రభుత్వాలు సరిగా స్పందించకపోతే తాను అమెరికా-మెక్సికో సరిహద్దులను పూర్తిగా మూసేస్తానని కూడా ట్రంప్ ఇటీవల బెదిరించారు. దాంతో, అక్కడి సిబ్బందిని పెంచుతూ నీల్సన్ ఆదేశాలిచ్చారు. కానీ, ఈలోపే ఏమయిందో.. నీల్సన్ రాజీనామా చేస్తున్నారని.. ఇన్నాళ్లూ ఆమె చేసిన సేవలకు ధన్యవాదాలని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆమె స్థానంలో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ కమిషనర్ కెవిన్ మెక్ అలీనన్ తాత్కాలిక మంత్రిగా ఉండబోతున్నారని కూడా చెప్పారు.
తన ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేయడానికి మరింత కఠినమైన వ్యక్తులు కావాలని ట్రంప్ ఇటీవలి కాలంలో అంటున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రిపైనే వేటు పడటంతో, ట్రంప్ మరింత కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోందని పరిశీలకులు అంటున్నారు. జాన్ కెల్లీకి సహాయకురాలిగా తొలుత నీల్సన్ 2017 జనవరిలో చేరారు. ఆయన ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన తర్వాత ఆయనకు డిప్యూటీ అయ్యారు. కానీ అక్టోబరునాటికల్లా మంత్రిగా వచ్చారు. సాధారణంగా విపత్తు సాయం, సైబర్ సెక్యూరిటీ, రవాణా భద్రత లాంటి వ్యవహారాలు చూసుకోవాల్సి ఉన్నా.. ట్రంప్ అవలంబించిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానానికే ఆమె ప్రతిరూపంగా మారారు. దాంతో ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్లు బాగా వచ్చాయి.