విశాఖ జోన్ సొగసు చూడ తరమా!

125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్టేరు డివిజన్ ఇక చరిత్రలో కలిసిపోనుంది

రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించగానే ఆ జోన్ కేంద్రస్థానంగా ఉండబోతున్న విశాఖపట్నంలో రాష్ట్ర బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి తదితరులు మిఠాయి తిని సంతోషం పంచుకున్నారు. నోటి తీపి తగ్గకముందే వారు జోన్ సాధించిన ఘనత తమదేనని చెప్పుకోవడం పోయి జోన్ ఏర్పాటులో అన్యాయం జరిగిందన్న విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితిలో పడ్డారు.

బుధవారం మంత్రి ప్రకటన రాగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే రైల్వే జోన్‌ సాధన ఘనత దక్కించుకునేందుకు ఎవరికి వారు పోటీలు పడడం ప్రారంభమయింది. తాము చేసిన ఉద్యమాల ఫలితమేనని ప్రతిపక్షంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించుకున్నది. అంతకాకపోయినా కాంగ్రెస్‌ కూడా కాస్త అటూఇటుగా ఇదే మాట అన్నది. తాము తలపెట్టిన భరోసా యాత్రకు భయపడే కేంద్రం రైల్వే జోన్ ప్రకటించిందని ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

ఇక అధికార తెలుగుదేశం పార్టీ సంగతేమిటి. ఎలా స్పందించాలో ఆ పార్టీ నాయకత్వం తేల్చుకునే లోపు రైల్వే  మంత్రి ప్రకటనలో డొల్లతనాన్ని ఉత్తరాంధ్ర వాసులు బయటపెట్టారు. దానితో టిడిపి ఊపిరి పీల్చుకుని మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో బిజెపిపై దాడి మొదలుపెట్టింది.

రాజకీయ పార్టీల స్పందన సంగతి సరే అసలు నిజం ఏమిటి? వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ఇవ్వడం కుట్ర అంటూ రైల్వే కార్మిక సంఘం నాయకుడు చలసాని గాంధీ అన్న మాటలు పరిస్థితికి అద్దం పడతాయి. ప్రభుత్వ ప్రకటన ప్రకారం  ఆదాయం తెచ్చిపెట్టే కిరండల్ లైను కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లో భాగం అవుతుంది. వాల్తేరు డివిజన్ లేకుండా తల లేని మొండె లాంటి జోన్ ఎందుకని రైల్వే వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

చివరివరకూ నాన్చి మోదీ సర్కారు ప్రకటించిన రైల్వేజోన్ ఎంత సొగసుగా ఉందో ఆదిలోనే తేలిపోయింది. ఇది ఆంధ్రులలో సంతోషాన్ని కలిగించకపోగా కడుపు మంట మిగిల్చింది. రైల్వే జోన్ ప్రకటించారని మిఠాయి పంచుకున్న రాష్ట్ర బిజెపి నేతలు ఈ ప్రశ్నలకు ఏమని సమాధానం ఇస్తారో చూడాలి. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల  విషయంలో ఇంతకాలం బుకాయించినట్లుగానే ఇప్పుడు కూడా బుకాయించే అవకాశమే ఎక్కువ.

నిజానికి బిజెపి నేతలకు వేరే అవకాశం లేదు. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనకు రెండు రోజుల ముందు రైల్వే మంత్రి జోన్ ప్రకటించారు. దీనికి క్రెడిట్ తామే కొట్టేయాలన్న ఉద్దేశంతో కొద్దిరోజుల క్రితం రాష్ట్ర బిజెపి నేతలను ఢిల్లీ పిలిపించి జోన్ కోసం రైల్వే మంత్రికి పిటిషన్ ఇప్పించారు. ఏం జరగబోతుందన్నది రాష్ట్ర బిజెపి నేతలకు తెలుసుననే దానికి వారు రైల్వే మంత్రి మీడియా సమావేశానికి పూలగుత్తులు పట్టుకురావడమే తార్కాణం.

కావాలనే ఆంధ్రకు లాభం లేని పద్ధతిలో, ఒదిషాకు లాభం ఉండే పద్ధతిలో జోన్ కోసం డివిజన్లు విభజించారని తెలిసిపోతూనే ఉన్నా ఆ మాట పైకి అనలేని పరిస్థితి రాష్ట్ర బిజపి నేతలది. వారు నోరు తెరవక పోయినా విశాఖ రైల్వే జోన్‌పై నిరసనలు రేగక తప్పని పరిస్థితి కనబడుతోంది. అప్పటికీ వారు మొండిగా తమ కేంద్ర నాయకత్వాన్ని వెనకేసుకు రాకతప్పదు. అందుకు ప్రజల ఆగ్రహాన్ని చవి చూడకా తప్పదు. అందుకు మహా అయితే ఎన్నికల వరకూ ఆగాల్సివస్తుంది అంతే.