టీడీపీని బీజేపీలో విలీనం చేయాలట!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలుగు రాష్ట్రాలలో బలపడేందుకు  ప్రయత్నిస్తున్న బిజెపి మైండ్ గేమ్‌లు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ఉన్నంతకాలం తాము అధికారం కోసం పోటీలో ఉండలేమని తెలిసిన బిజెపి నాయకులు కొత్త ఎత్తులు మొదలుపెట్టారు. 2019 ఎన్నికలలో 175 స్థానాలలో పోటీ చేసిన బిజెపి ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేక పోయింది. మొత్తం మీద ఆ పార్టీకి 0.84 శాతం వోట్లు వచ్చాయి. అలాంటి పార్టీ నాయకులు టిడిపిని తమ పార్టీలో విలీనం చేసుకుంటామంటున్నారు. ఈ మాట చెప్పింది మరెవరో కాదు స్వయానా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. టీడీపీని తమ పార్టీలో విలీనం చేస్తానని చంద్రబాబు నాయుడు చెబితే తమ అధిష్టానంతో మాట్లాడతానని జీవీఎల్ అన్నారు. ఆయన వ్యంగ్యంతో అన్నట్లు కనిపిస్తున్నా.. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురిని చేర్చుకున్న కాషాయదళం మనసులో మాటకు ఇది సంకేతంగా కనిపిస్తోంది. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారి వల్ల తమ పార్టీకి ఒరిగేదేమీ లేదని, వారి రాజకీయ మనుగడ కోసమే తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని, పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయిన టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం లేదని విమర్శించారు. రాజకీయ భవిష్యత్‌ మీద భయంతోనే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో  విభేదించి తప్పు చేశామని అంటున్నారని అన్నారు.

‘మాది జాతీయ పార్టీ. ఓడిపోయిన పార్టీ నుంచి పది మంది వస్తే మేం బలపడం. టీడీపీ పరిస్థితి బాగాలేదు. చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. టీడీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల ఒరిగేమీ ఉండదు. కేసుల పేరుతో మేం చంద్రబాబును బెదిరించడం లేదు. అవినీతి ఎవరు చేసిన శిక్ష అనుభవించాల్సిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి ఎవరు పాల్పడినా వదిలేదు లేదు. పోలవరంపై మేం లెక్కలు అడిగాం. చంద్రబాబు చెప్పలేదు. ఆయనకు టీడీపీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం ఉంటే చెప్పాలి. నేను మా అధిష్టానంతో మాట్లాడుతాను..’ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో బలం పెంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దాంతో పాటు రాజకీయంగా బలం పెంచుకుంటూనే మరోవైపు అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సమానదూరంలో ఉండాలని పార్టీ భావిస్తోంది. పార్టీని ముందుగా పటిష్టం చేసుకునేదిశగా అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుంది. వైపీసీ నుంచి బీజేపీలో చేరే అవకాశాలు ఇప్పడయితే లేవు గానీ, టీడీపీలో ఉన్న అసంతప్తులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్న నేతల చేరికలను ఇకపై ఆలస్యం చేయకూడదన్న అభిప్రాయంతో పార్టీ ఉన్నట్టు సమాచారం. ఫలితంగా టీడీపీని బలహీనపరచాలని ప్లాన్ చేసింది. ఏపీలో పటిష్టమైన రాజకీయ పునాదులున్న తెలుగుదేశం పార్టీకి అన్ని జిల్లాల్లో జనాదరణ ఉన్న నేతలున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలువలేదు. అలాంటిది  టీడీపీని బీజేపీలోకి విలీనం చేయాలని జీవీఎల్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అయితే, జీవీఎల్ తాజా కామెంట్లపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.