అయోధ్యలో ఏ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మిస్తుంది?

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే, కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రామజన్మభూమి న్యాస్‌ చీఫ్‌ మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘న్యాస్ అనేది రామాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడిన ట్రస్ట్, నిర్మోహి అఖారా వంటి వారి సహకారంతో ఈ పనిని పూర్తి చేస్తాం’ అని గోపాల్‌ దాస్‌ వ్యాఖ్యానించారు. అయితే, నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్ దీనికి అంగీకరించలేదు. ‘మేము రామ్ జన్మభూమి న్యాస్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. వారి ట్రస్టులో తాము ఎలా సభ్యత్వం పొందుతాం. వారే మాతో కలిసి రావాలి. మేము వారితో భాగం కాలేము. దీనిపై ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొని అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి’ అని దినేంద్ర దాస్ పేర్కొన్నారు.

వివాదాస్పద స్థలం తమదేనన్న నిర్మోహి అఖారా అప్పీల్‌ను సుప్రీం కొట్టివేసిన సంగతి తెలిసింది. అయితే సెక్షన్ 142 ప్రకారం అయోధ్య ట్రస్టులో నిర్మోహి అఖారాకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించింది. అయోధ్యలో బలమైన అఖారాల్లో దిగంబర్ అఖారా ఒకటి. దీనికి న్యాయ్ అధ్యక్షుడిగా ఉన్న రామ్ చంద్ర దాస్ నేతృత్వం వహించారు. ప్రస్తుత చీఫ్ మహంత్ సురేష్ దాస్ బుధవారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తో సమావేశం కానున్నారు.

వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని సుప్రీం స్పష్టం చేసింది.రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో కూడిన ఓ ట్రస్ట్ గానీ, వేరే ఇతర బాడీని గానీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. ట్రస్ట్ లేదా బాడీ యొక్క పనితీరుకు సంబంధించిన ట్రస్ట్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిబంధనలు చేస్తుంది.

అయితే, కొత్త ట్రస్టు ఏర్పాటుపై న్యాస్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ స్పందించారు. కొత్త ట్రస్టు ఎందుకు ఏర్పడాలి? ఎవరు దీనిని ఏర్పాటు చేస్తారు? దాని సభ్యులు ఎవరు? అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. మరోవైపు దిగంబర్ అఖారాకు చెందిన మహంత్ సురేష్ దాస్ తాను ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ధృవీకరించారు. ఈ అంశమై తాను సీఎంతో చర్చించిన తర్వాతే మాట్లాడుతానని తెలిపారు. సుప్రీం తీర్పును స్వాగతించారు. సోమనాథ్ ఆలయ ట్రస్టు మాదిరిగా కొత్త ట్రస్టు ఏర్పాటు చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆలయాన్ని నిర్మించడం ప్రభుత్వ పని కాదని మహంత్ సురేష్ దాస్ పేర్కొన్నారు.