న్యూయార్క్: వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు) అందుబాటులోకి వచ్చి మూడు దశాబ్దాలు గడిచింది. ఈ సందర్భంగా గూగుల్ ఒక డూడుల్ రూపొందించి ప్రదర్శించింది. భూమి ఒక కంప్యూటర్ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉండి, దాని అక్షరాలు ఒక స్విచ్చికి అనుసంధానం అయి ఉన్నట్లు అది ఉంది. నిజానికి ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ మధ్య చాలా తేడా ఉంది. హెచ్.టి.ఎం.ఎల్. లాంగ్వేజ్, యూఆర్ఎల్, హెచ్.టి.టి.పి. (హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్) ఆధారంగా రూపొందిన అప్లికేషనే వరల్డ్ వైడ్ వెబ్. ఈ డూడుల్ ఆఫ్రికా ఖండంలోని కొన్ని ప్రాంతాలు తప్ప ప్రపంచమంతటికీ వెళ్లింది. కొన్ని బ్లాకులతో కూడిన యానిమేషన్ తరహాలో ఇది ఉంది. వెబ్ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవో అది చూపించింది. పాతతరం నాటి డబ్బా కంప్యూటర్ ఒకటి ఉండి, గూగుల్ లోని రెండో అక్షరం అయిన ‘ఓ’ నుంచి ప్లగ్ ద్వారా కరెంటు వచ్చినట్లు, అపుడు ఒక వెబ్ పేజీలో భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లు అది ఉంది.
మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ అయిన వరల్డ్ వైడ్ వెబ్.యాప్ అనేదాన్ని సర్ టిమ్ బెర్నర్స్ -లీ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తయారు చేశారు. 1989 మార్చి 12వ తేదీన ఆయన తన ప్రతిపాదనను ‘ఇన్ఫర్మేషన్ మేనేజిమెంట్: ఎ ప్రపోజల్’ అనే పేరుతో తన బాస్ కు ఇచ్చారు. స్విట్జర్లాండ్ లోని తన సెర్న్ కంపెనీ సహోద్యోగులు పలు కంప్యూటర్ల మధ్య సమాచారం పంచుకోడానికి హైపర్ టెక్స్ట్ డేటాబేస్ ఉపయోగపడుతుందని ఆయన మొదట్లో భావించారు. 1991 నాటికి ఎక్స్ టర్నల్ వెబ్ సర్వర్లు పనిచేయడం మొదలైపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తమ్మీద దాదాపు 200 కోట్ల వెబ్ సైట్లు ఉన్నాయి. ప్రస్తుత సమాచార యుగంలో ఏం కావాలన్నా వెంటనే వెబ్ సైట్లు ఓపెన్ చేస్తున్నామంటే దీని పుణ్యమే. ఈమెయిల్ చూడాలన్నా, గేములు ఆడాలన్నా, చదువుకోవాలన్నా, వార్తలు చూడాలన్నా అన్నింటికీ వెబ్ సైట్లే ఆధారం. ప్రపంచం మొత్తాన్ని మార్చిన ఆవిష్కరణలు చాలా తక్కువని, వాటిలో ఇదొకటని వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్షియం సీఈవో జెఫ్ జేఫ్ అన్నారు.