(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నేత నాగరాజు ఇంటి చుట్టూ వైసీపీ నేత బండలు పాతడం కలకలం రేపింది. వెంకటాపురంలో నాగరాజు నివాసం ఉంటారు. స్థల వివాదం నేపథ్యంలో నాగరాజు ఇంటికి అడ్డుగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బండలు పాతించారు. దీంతో బయటి నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
వైసీపీకి చెందిన పెద్దిరెడ్డికి.. టీడీపీ నేత నాగరాజుకు మధ్య కొన్నాళ్లుగా వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగరాజు ఇంటి చుట్టూ ప్రభుత్వ రోడ్డుపైనే అడ్డంగా నాపరాళ్లు పాతించడం గొడవకు దారి తీసింది. వీటిని తొలగించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడం, వైసీపీ వర్గీయులు కూడా అక్కడికి వచ్చి ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో పరిస్థితులు తెలుసుకున్న పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. టీడీపీ నేత స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆ గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఏ విధంగా అడ్డుకుంటారని, అడ్డంగా బండలు ఎలా పాతుతారని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక ఒత్తిడులు ఎదురు అవుతున్నాయి అని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దాడులు చెయ్యటం, ఊరి నుంచి వెళ్ళగొట్టడం, ఆర్ధికంగా ఇబ్బందులు పెట్టటం, పంటలు నరకటం, ఇళ్ళకు అడ్డుగా గోడలు కట్టటం, రోడ్లు తవ్వేయటం ఇలా అనేకం చేసారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారి పోతుంటే.. డీజీపీ, హోంమంత్రి మాత్రం అంతా బాగుంది అని చెప్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది. నాలుగు నెలల క్రిందట ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇళ్ళకు వెళ్ళకుండా, అడ్డంగా వైసీపీ వర్గీయులు గోడ కట్టారు. దీంతో టీడీపీ సానుభూతిపరుల ఇళ్ళకు దారిలేకుండా పోయింది.