పోలీసు బూటును ముద్దాడిన వైసీపీ ఎంపీ

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. జేసీ మాటలకు కౌంటర్‌గా పోలీసు బూట్లు తుడిచిన ఎంపీ గోరంట్ల మాధవ్.. అనంతరం ఆ బూట్లను ముద్దాడారు. ఇలా చేసినందుకు తాను గర్వపడుతున్నాను అన్నారు. పోలీసుల బూట్లు అంటే యుద్ధంలో ఆయుధాలు అని తెలిపారు. దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని అలాంటి పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ జన్మనిస్తే.. రక్షణగా ఉండే పోలీసులు పునర్జన్మ ఇస్తారని దివాకర్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు.

పోలీసులు అహర్నిశలు ప్రజల కోసం పని చేస్తున్నారని,  దివాకర్ రెడ్డికి రక్షణ కల్పిస్తున్నది పోలీసులనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. జేసీపై తాను మీసం తిప్పితే ఎంపీ అయ్యానని చెప్పారు. గతంలో పోలీసులను తిట్టినందుకే పతనావస్థకు చేరారని ఎద్దేవా చేశారు. జేసీని ప్రజలు బజారుకీడ్చారని, రాజకీయ సమాధి కట్టారన్నారు. జేసీ మాట్లాడుతుంటే దుర్యోధనుడిలా టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వారని విమర్శించారు. చంద్రబాబుకు ఎలా నవ్వు వచ్చిందని, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎంపీ గోరంట్ల మాధవ్ వైడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, గత బుధవారం(డిసెంబర్ 18) అనంతపురంలో జరిగిన టీడీపీ సమీక్ష సమావేశంలో జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చాక, తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. టీడీపీ కార్యకర్తల్ని బెదిరించిన వారిపై కేసులు పెట్టిస్తామని.. సారా, గంజాయి కేసులు పెట్టిస్తామని చెప్పారు.