పల్నాడులో పరిస్థితి చేజారిందా!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

పల్నాడులో ఏం జరుగుతోంది? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించినంత సీరియస్‌గా ఉందా అక్కడ పరిస్థితి? లేక అధికారపక్షమైన వైసిపి మాటల్లో నిజం ఉందా? రెండు శిబిరాలూ పరస్పరం ఆరోపణలతో ఇప్పటికే వాతావరణాన్ని వేడెక్కించాయి. తాజాగా వైసిపి పిడుగురాళ్లలో టిడిపి బాధితుల సమావేశం ఏర్పాటు చేయడంతో విషయం ఇంకాస్త ముదిరింది.

కొద్ది రోజుల క్రితం అధికారపక్షం దాడులకు ఊరు వదిలిన కార్యకర్తల కోసం అంటూ టిడిపి వారు గుంటూరులో ఒక శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్వరం హెచ్చించిన తర్వాత వైసిపికి దీని వల్ల ఎంతో కొంత నష్టం జరుగుతున్న విషయం అర్ధమయింది. దానితో పిడుగురాళ్ల సమావేశం ఆలోచన రూపుదిద్దుకున్నది.

నిజానికి వైసిపి దాడుల వల్ల టిడిపి కార్యకర్తలు కొందరు ఊళ్లు వదిలిన విషయాన్నిగురజాల డిఎస్‌పి శ్రీహరి రాజు పరోక్షంగా అంగీకరించారు. ఊళ్లు వదిలిన వారు తిరిగి రావాలనీ, వారికి తగిన భద్రత కల్పిస్తామనీ ప్రకటించారు. ఊళ్లు వదిలిన కార్యకర్తలకు మంగళవారం లోగా భద్రత కల్పించకపోతే బుధవారం తానే వారిని వెంట తీసుకువెళతానంటూ చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమం ప్రకటించడంతో పోలీసుల్లో చురుకు పుట్టింది.

టిడిపి చిత్రిస్తున్నంత పెద్ద స్థాయిలో కాకపోయినా పల్నాడులో సమస్య ఉన్న మాట నిజమేనని ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. గురజాల నియోజకవర్గం పరిధిలోని పిడుగురాళ్ల మండలంలో పిన్నెల్లి, కోనంకి, తుమ్మలచెరువు, మాచవరం మండలంలో మోర్జంపాడు, దాచేపల్లి మండలంలో తంగెడ గ్రామాలలో, మాచెర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గి మండలంలో ఆత్మకూరులో రాజకీయవైరం సమస్యగా మారింది. అధికారపక్షం ధాటికి భయపడి కొందరు ఊళ్లు వదిలివెళ్లిన మాట కూడా నిజమే.

పోలీసులు మొదటే తగిన చర్యలు తీసుకుంటే ఇంతదాకా వచ్చేది కాదు. పైగా అధికారులు మౌనం పాటించారు. గుంటూరు రూరల్ ఎస్‌పి జయలక్ష్మి విషయం చక్కదిద్దలేదు సరికదా మీడియాకు కూడా అందుబాటులోకి రాలేదు. నిజానికి ఈ సమస్య తెచ్చిపెట్టిందే పోలీసు అధికారులని చెప్పవచ్చు. ఎప్పుడైనా గానీ ఎన్నికల అనంతరం అధికారపక్షం, ప్రతిపక్షం కార్యకర్తల మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరగడం సహజమే. అలాంటి సమయాలలో అధికారపక్షం నుంచి పోలీసులపై వత్తిడి రావడం కూడా సహజమే. పోలీసుల ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి బయటపడేది అప్పుడే. గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ విషయంలో జాగ్తత్తగా వ్యవహరించలేకపోయింది. చివరికి చిలికి చిలికి గాలివాన అయింది. రెండు పక్షాలూ బిగిసి కూర్చున్నాయి. విషయాన్ని ఇంతదాకా రానివ్వడం ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలకు నిలయమైన పల్నాడుకు ఏమాత్రం మంచిది కాదు.