“నాకు దక్కనిది.. ఇతరులకు దక్కడానికి వీల్లేదు”ఈ డైలాగులను మనం తరచూ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాము. ప్రస్తుతం ఈ డైలాగులనే నిజజీవితంలో కూడా ఎంతోమంది ఉపయోగిస్తూ ఉండటం గమనార్హం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందన్న కోపంతో ఏకంగా ఆ యువతిని తుపాకితో కాల్చి చంపిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.
మహారాష్ట్ర ముంబై నగరంలోని మలాడ్ ప్రాంతానికి చెందిన రాహుల్, సోనాలి(పేర్లు మార్చాము) గత కొద్ది రోజులుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం సోనాలి ఇంటిలో తెలియడంతో, వారి ప్రేమకు అడ్డు చెప్పిన కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. సోనాలికి మరొక యువకుడితో వివాహం నిశ్చయించి నిశ్చితార్థం చేశారు. అయితే సోనాలి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేక, ఇంట్లో పెద్దలను ఎదిరించలేక ఎంతో మానసిక వేదన అనుభవించింది.
రాహుల్, సోనాలి తనని కాదని మరొక వ్యక్తితో పెళ్లికి ఒప్పుకుందన్న కోపంతో రాహుల్ ఆమె పై పగ పెంచుకుని, నాకు దక్కనిది ఇతరులకు దక్కడానికి వీల్లేదని సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాహుల్ తను ఎంతగానో ప్రేమించిన సోనాలిని తుపాకితో కాల్చి చంపేశాడు. అనంతరం సోనాలి లేని జీవితం తనకు అవసరం లేదని భావించిన రాహుల్ అదే తుపాకితో తను కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ ఘటన పై పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ దిలీప్ సావంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.