స్థిరమైన ఓటు బ్యాంక్‌ జగన్ ‌లక్ష్యమా?

అమరావతి: రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా అవి పట్టించుకోకుండా తన దైన శైలిలో ముందుకు సాగుతున్నట్లు కనబడుతోంది. ఎన్నికల్లో 50 శాతానికి పైగా సాధించిన ఓటింగ్‌ను  సుస్థిరం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కనబడుతోంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందేలా చర్యలు చేపట్టడం వెనుక మరో లక్ష్యం ఉండే అవకాశం లేదు.

రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతుండగా ఈ సమస్యపై ప్రతిపక్షాలు అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే సుమారు నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను వైసిపి ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు కల్పించింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చి ఫాదర్‌లకు గౌరవ వేతనాలు, జూనియర్ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నగదు ప్రోత్సహకాలు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నది.

అదే విధంగా నవరత్న పథకాలను అమలు చేయడంతో పాటు వివిధ వర్గాలకు ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగించే పనిలో ప్రభుత్వం ఉంది. అర్హులైన వివిధ వర్గాలకు ఏదో రూపేణ ప్రభుత్వ ఆర్థిక చేయూత నిచ్చే పథకాలకు రూపకల్పన చేసింది. రైతులకు రైతు భరోసా, ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఏటా ఆర్థిక సహాయం, మత్స్యకారులకు వేట విరామ సమయంలో పదివేల వంతుల ఆర్థిక సహాయం, చేనేత కార్మికులకు, పిల్లలను బడిలో పంపించే తల్లులకు ఏటా నగదు పంపిణీ ఇలా అనేక వర్గాలకు చేయూతను ఇచ్చే పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైనది ఏపిఎస్ ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ. రాబోయే ఎన్నికల నాటికి విలీన ప్రక్రియ పూర్తి అయితే వేలాది మంది ఆర్‌టిసి కార్మికుల కుటుంబాలు వైసిపి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడే అవకాశం ఉంది. పాదయాత్రలో జగన్మోహనరెడ్డి వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగడం చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకు చెక్క చెదరకుండా ఉంచుకోవాలన్నది వైసిపి ధ్యేయంగా కనబడుతున్నది.