జగన్‌ వ్యూహం ఎదురు తిరుగుతుందా!?

ఎన్నికల ముంగిట కడప జిల్లా, పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ రంగస్థలాన్ని వీడడం లేదు. తన బాబాయిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చంపించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆరోపిస్తున్నారు.  చంద్రబాబు ప్రభుత్వంపై, ఆయన కింద పనిచేసే పోలీసులపై తనకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ దర్యాప్తు కోరుతున్నానని అంటున్నారు. రాష్ట్రప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు అంగీకరించే పరిస్థితి లేదు కాబట్టి హైకోర్టులో ఒక కేసు కూడా వేయించారు.

మరోపక్క చంద్రబాబు కూడా దీనిని వదలడం లేదు. వివేకా హత్య జరిగిన రోజు సాయంత్రం జగన్ పులివెందుల వెళ్లి అక్కడ తనపై ఆరోపణ చేసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. రాత్రికి మీడియా సమావేశం పెట్టి తీవ్రంగా ఎదురుదాడి చేశారు. వివేకానంద రెడ్డి మృతిని గుండెపోటు మరణంగా చిత్రించేందుకు ముందు ఎందుకు ప్రయత్నించారని ఆయన ప్రశ్నించారు.

శవపరీక్షలో వివేకాను హత్య చేసినట్లు తేలడంతో అప్పుడు కథ మార్చారనీ, తనపై ఆరోపణలు మొదలుపెట్టారనీ చంద్రబాబు అన్నారు. హత్యాస్థలంలో రక్తం ఎందుకు తుడవాల్సి వచ్చిందనీ, వివేకా తలకు ఎందుకు గుడ్డలు చుట్టాల్సివచ్చిందనీ ఆయన ప్రశ్నించారు.

మరుసటి రోజు నుంచీ చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలోనూ వివేకా హత్య విషయం ప్రస్తావిస్తున్నారు. ముందు ఏకరవు పెట్టిన ప్రశ్నలు ప్రతి చోటా వేస్తున్నారు. జగన్ కూడా ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ వివేకా హత్యతో  ముఖ్యమంత్రికి లంకె పెడుతున్నారు.

రాష్ట్రంలోని వోటర్లు ఈ ఇద్దరు నాయకుల వాదనలో దేనిని విశ్వసిస్తారు? న్యూస్ ఛానళ్ల పుణ్యమా అంటూ హత్య ఎవరు చేశారన్నది మినహా ఆ రోజున ఏంజరిగిందీ ప్రజలందరకూ తెలిసిపోయింది. జగన్ యాజమాన్యంలోని సాక్షి ఛానల్ కూడా ఉదయం చాలాసేపు వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పిన విషయం జనానికి తెలిసిపోయింది. క్రయిం సీన్‌లో సాక్ష్యాధారాలను తుడిచేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న మాటను కూడా జనం నమ్ముతున్నారు.

వివేకా హత్య విషయంలో జగన్ మౌనంగా ఉండి పోలీసులను తమ పని తాము చేసుకోనివ్వాల్సిందని వైసిపి అభిమానులే అంటున్నారు. తటస్థ వోటర్లలో కొందరిపైనన్నా ఇది ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంగీకరిస్తున్నారు. అందుకే చంద్రబాబు వివేకా హత్యోదంతాన్ని వదలడం లేదు.