ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో వివిధ రకాల కులాలు, మతాల ప్రజలు నివసిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ప్రపంచంలో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కొంతమంది వారి వింత ఆచారాలను, మూఢ నమ్మకాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉంటారు. అలాంటి ప్రాంతానికి చెందిన వారే ఈ మాఫీ డవ్ గ్రామ ప్రజలు. ఈ గ్రామంలోని ప్రజలు పిల్లలకు జన్మనివ్వడం, చనిపోయిన వారిని పూడ్చడం, జంతువులను పెంచడం మహా నేరంగా పరిగణిస్తారు. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇది చదవండి!
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనా దేశంలోని మాఫీ డవ్ గ్రామంలో ఐదు వేల జనాభా నివసిస్తుంటారు. పిల్లలు పుట్టకుండా ఇంత జనాభా ఎలా? అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అదే ఆ వూరి ఒక వింత ఆచారం. ఈ గ్రామంలోని ప్రజలు గర్భం దాల్చవచ్చు కానీ పిల్లల్ని కనకూడదు. అక్కడ పక్షులను, జంతువులను పెంచకూడదు కానీ వాటిని తినవచ్చు. చనిపోయిన వారికి ఎవరికి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించరు. ఎందుకిలా ఆచారాలను పాటిస్తారు అని ఆ గ్రామంలో వృద్ధులను అడిగితే వారు ఇలా చెప్పారు…
పూర్వకాలంలో ఈ గ్రామానికి టాగ్బే గబెవొఫియా అకిటీ అనే వేటగాడు మొదటిసారిగా వచ్చాడు. అక్కడ అతనికి ఒక రహస్య గొంతు వినబడింది. మాఫీ డావ్ గ్రామం ఎంతో ప్రశాంతమైనదని, ఈ గ్రామంలో నివసించే ప్రజలు పిల్లల్ని కనకూడదని, జంతువులను పెంచకూడదు, చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించరాదు. ఈ నిబంధనలు పాటిస్తే ఇక్కడ నివసించే ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారని ఈ నిబంధనలను పాటించకపోతే మీ ఊరికి కీడు జరిగే అంతరించిపోతుందని చెప్పాడు.
ఆ మాటలు విన్న వేటగాడు అక్కడే నివసించి పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య గర్భం దాల్చి, పక్క ఊరిలో పిల్లల్నికంటుంది. అలా ఒక్కొక్కరుగా వచ్చి ఆ ప్రాంతంలో స్థిరపడిపోయారు. కానీ ఆ గ్రామంలో గర్భం దాల్చిన మహిళలు ప్రసవానికి కొద్ది నెలల ముందుగా వేరే ఊరికి వెళ్లి అక్కడ ప్రసవం అయిన తర్వాత బిడ్డ బొడ్డుతాడు పడిపోగానే తిరిగి వారిని గ్రామానికి చేరుకుంటారు. పక్క ఊరు నుంచి తెచ్చుకున్న జంతువులను, పక్షులను తెచ్చిన రోజే తినాలి. అలా చేయకుండా మరుసటి రోజు తింటే వారికి శిక్ష పడడమే కాకుండా గ్రామ బహిష్కరణ జరుగుతుంది. చనిపోయిన వారికి ఆ గ్రామంలో కాకుండా పక్క గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మాఫీ డావ్ గ్రామంలోని ప్రజలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు.