ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటున్న క్యాబ్ డ్రైవర్..?

ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు సినిమాల కంటే వివాదాలతోనే పాపులర్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ సినీ నటి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ముమైత్ ఖాన్ తనకు డబ్బులు ఎగ్గొట్టిందంటూ రాజు అనే క్యాబ్ డ్రైవర్ తీవ్ర ఆరోపణలు చేశారు. క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ కు ముమైత్ ఖాన్ తనకు 15 వేలు ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదు చేశారు.

 

ఈ ఫిర్యాదుతో ముమైత్ ఖాన్ పై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మొమైత్ ఖాన్ ఇలా చేయడమేంటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోవాకు మూడు రోజుల ట్రిప్ కోసం మాట్లాడుకుని ముమైత్ తనను మోసం చేసిందని రాజు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అసోసియేషన్ ద్వారా సమస్య పరిష్కారం కాని పక్షంలో రాజు పోలీసులను ఆశ్రయించనున్నాడు.

అయితే ఈ ఆరోపణలు నిజమని తేలితే మాత్రం మొమైత్ సినిమా కెరీరే ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ముమైత్ ఖాన్ మొదట మూడు రోజుల ట్రిప్ కోసం కారు మాట్లాడుకుందని ఆ తరువాత మూడు రోజుల నుంచి ఎనిమిది రోజులకు ట్రిప్ ను పొడిగించిందని.. టోల్ గేట్ కు, వసతి కోసం కూడా తన డబ్బులే ఖర్చు చేశానని రాజు తన తన ఆవేదనను వెళ్లగక్కారు.

అనేక సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటించి మెప్పించిన మొమైత్ ఖాన్ కొన్ని సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న మొమైత్ డ్రగ్స్ వివాదంతో వార్తల్లోకెక్కింది. గత రెండేళ్లుగా పెద్దగా అవకాశాలు లేని మొమైత్ ఈ కేసు ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.