Fevicol: ఫెవికాల్ Fevicol వాస్తవ సంఘటనలను, సంక్షోభాలను, జీవితంలో ఎదురయ్యే గుణపాఠాలను.. అవకాశాలుగా మార్చుకునే వ్యక్తులు ఉంటారు. తమకెదురైన అనుభవాలు మాత్రమే కాకుండా చుట్టూ జరిగే పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అవే వారి గెలుపుకు విజయ సోపానాలు అవుతాయి. ఇలానే ఆలోచించింది ‘ఫెవికాల్’. సొంతంగా ఆలోచించి.. బుర్ర బద్దలుకొట్టుకుని ఆలోచించేదేదో.. సంచలనాలు నమోదు చేసిన సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించినట్టుంది. తన మార్కెటింగ్ స్ట్రాటజీకి పదును పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన రొనాల్డో-కోకాకోలా అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఓ యాడ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇటివల పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో యూరో ఫుట్ బాల్ చాంపియన్ షిప్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. అక్కడ రొనాల్డో వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన ముందున్న రెండు కోక్ బాటిళ్లను పక్కన పెట్టేశాడు. మంచినీరు బాటిల్ చూపిస్తూ తాగాలంటూ ఓ సిగ్నల్ ఇచ్చాడు. రొనాల్డో చర్యతో కోకాకోలా కంపెనీకి గంటల్లోనే రూ.29వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనినే తనకు అనుకూలంగా మార్చుకుంది ఫెవికాల్. రొనాల్డో ప్రెస్ కాన్ఫరెన్స్ మాదిరిగానే ఓ ప్రెస్కాన్ఫరెన్స్ టేబుల్ ఉంచి దానిపై రెండు ఫెవికాల్ డబ్బాలను ఉంచింది. కింద.. ‘వీటిని ఎవరూ కదపలేరు.. విలువ పడిపోదు’ అనే కామెంట్ ను జోడించి ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అయిపోయింది. నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
Read More: Mango Tree: ఏడు మామిడిపండ్లకు నలుగురు వ్యక్తులు.. ఆరు కుక్కలు కాపలా.. ఎందుకు?
నెటిజన్లే కాదు.. హర్షా గొయెంకా వంటి పారిశ్రామికవేత్తలు కూడా ఫెవికాల్ క్రియేటివిటీకి ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి ఫెవికాల్ తన మార్కెటింగ్ స్ట్రాటజీ, సెన్సాఫ్ హ్యూమర్, క్రియేటివిటీతో ప్రజలను దశాబ్దాలుగా ఆకట్టుకుంటూనే ఉంది. వినూత్నమైన ఐడియాలతో యాడ్స్ చేస్తుంది.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. వీటికి అభిమానులు ఎక్కువ. ఇప్పుడు మరోసారి ప్రజల్లో అటెన్షన్ క్రియేట్ చేసింది. రొనాల్డో చేసిన పనిని, కోకాకోలాకు జరిగిన నష్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ‘క్రియేటివిటీ పీక్స్’, ‘రొనాల్డో ఆ కుర్చీలో కూర్చేని ఉండుంటే ఏమైపోయేవాడో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫెవికాల్ ట్వీట్, మార్కెటింగ్ స్ట్రాటజీ, క్రియేటివిటీ వైరల్‌గా మారింది.