జామకాయ.. మనం తినే పండ్లల్లో ఇది ఓ సూపర్ పవర్ ఆహారం. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. జామకాయలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్, ఫైబర్, విటమిన్ ఏ, సీ, ఈ, కే, కాల్షియం, సోడియం, పొటాషియంలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇదిఒక సూపర్ పవర్ ఫుడ్.
మరీ శరీరానికి అవసరమైన ఇన్ని పదర్థాలను కలిగిన జామకాయలను అతిగా తినడం ద్వారా జలుబు చేస్తుంది అని చాలా మంది చెబుతుంటారు. మరి ఇది వాస్తవమేనా? మరీ ముఖ్యంగా త్వరలో మొదలు కానున్న చలి కాలంలో వీటిని తినడం ద్వారా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయా? జామ కాయలను తీసుకోవడం ద్వారా సీజనల్గా వచ్చే రోగాలు బారినపడే అవకాశాన్ని పెంచుతుందా? ఇలాంటి వాదనల్లో నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. !
జామకాయలను అతిగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జామను తినడం ద్వారా జలుబు చేస్తుందనడంలో ఎలాంటి వాస్తవమూ లేదని కొట్టిపారేస్తున్నారు. జామలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయనీ, వాటిల్లో జలుబును తగ్గించడం కూడా ఒకటని పరిశోధకులు చెబుతున్నారు. జామకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల గొంతు, ఊపిరితిత్తు సమస్యలు తగ్గిపోతాయని తమ అధ్యయనంలో రుజువైందని చెబుతున్నారు.
సీజన్లతో సంబంధం లేకుండా జామకాయలను తినవచ్చునని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం బయో కెమిస్ట్రీ విభాగం మాజీ ప్రొఫెసర్ డి.బాలస్వామి చెబుతున్నారు. జామ కాయలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి భారీగా పెరుగుతుందని తెలిపారు. దీనికి జామలో ఉంటే సూక్ష్మ పోషకాలు, ఖనిజల లవణాలు, విటమిన్లే కారణమని వివరించారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారినపడే అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.
అలాగే, జామ కాయ తినడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. కంటి చూపు తగ్గకుండా ఉండటంలో సహాయపడుతుంది. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. డయాబెటీస్ రోగులు కూడా వీటిని తీసుకోవడం మంచిది. రక్తం ఉత్పత్తిలో కూడా కీలకంగా ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మరి మీకు అందుబాటులో వుంటే జామకాయలు తిని ఆరోగ్యంగా ఉండండి.