కేసీఆర్ వరాలిచ్చినా సినిమా హాళ్ళు నడవడం కష్టమే…? మరీ ఇంత నష్టానికి తెరవాలా?

మొత్తానికి 9 నెలల తర్వాత కరోనా కారణంగా మూతపడిన సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిరోధక చర్యలతో థియేటర్లు నడపవచ్చు అని అంగీకారం తెలిపింది. కరోనా మహమ్మారి ఇంకా తగ్గకపోవడం సెకండ్ వేవ్ భయం కలిగిస్తుంది అంటే మరో వైపు ఓటితికి అలవాటుపడిన ప్రజలను చూసి సినిమా భవిష్యత్తు పైన చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

 

ఇక గతంలో లాగా సినిమాలకు ప్రజలు వస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. అదీ కాకుండా కేవలం 50 శాతం టిక్కెట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రదర్శనకు ముందు ప్రతి షో కి హాల్ అంతా శానిటైజ్ చేయాలి. ప్రవేశ ద్వారం వద్ద ఖచ్చితంగా శానిటైజర్స్ ను అందుబాటులో ఉంచాలి. సిబ్బందికి అదనపు రక్షణ ఉండాలి. ఇవన్నీ అదనపు ఖర్చు. వీటితో పాటు 50 శాతం టిక్కెట్లను మాత్రమే అమ్మాలంటే సినిమా హాళ్ళను నడపడం చాలా కష్టం.

ఇక ఒక మాదిరిగా ఉండే సినిమాలు, ఫ్లాప్ సినిమాలకు ఆ టికెట్లు కూడా తెగవు. ఇలాంటి సమయంలో టికెట్ రేట్లు మీ ఇష్టం అంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఎక్కువ రేటు పెడితే ఆ టికెట్లు కూడా అమ్ముడుపోవేమో అని భయం. మామూలు ధర కి పెడితే భారీ నష్టం వచ్చే ప్రమాదం. ఇక పెద్ద సినిమాల టికెట్ల ధరలను తొలివారంలోనే పెంచుకోవడానికి గతంలో అనుమతించారు కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా థియేటర్లకు వాటిని వదిలేసినట్లు తెలుస్తోంది.

దీంతో సామాన్యుడిపై కూడా ఎక్కువ భారం పడుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద సినిమా వస్తే ఇంటికెళ్లి పైరసీ లో డౌన్లోడ్ చేసి చూసుకుంటాము ఇంత రేటు పెట్టి రిస్క్తో కూడుకున్న సినిమా చూడము అని ప్రేక్షకులు వెనక్కి తగ్గితే మొదటికే మోసం వస్తుంది. ఇక హిట్ అయిన సినిమా కి ఇక్కడే 50 శాతం టికెట్లపై వచ్చే ఆదాయం చేయాలి అని చూస్తే మాత్రం సామాన్యుడికి టికెట్ ధర అందుబాటులో ఉండదు. కాబట్టి అసలు సినిమా హాళ్ళ పరిస్థితి ఏమిటో తెలియక అందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు..!