LIC: పెట్టుబడుల కోసం మార్కెట్లో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎల్ఐసి పాలసీ ఒకటి. LIC పాలసీల ద్వారా పెట్టుబడి పెట్టడాన్ని అత్యంత సురక్షిత మార్గంగా భారతదేశంలో ఎక్కువ మంది భావిస్తారు. వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మన దేశంలో కొన్ని కోట్ల మంది కనీసం రెండు కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటారు. పేదలు కూడా కనీసం ఒక పాలసీ అయినా కట్టడం సహజం. అయితే దీనికి ప్రధాన కారణం పెట్టుబడితో పాటు జీవిత బీమా సౌకర్యాన్ని కూడా పొందవచ్చు అని.. మరియు పాలసీదారు మరణిస్తే ఈ పాలసీ బాధ్యత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతుందని నమ్మకం..

పాలసీకి ఇకపై డబ్బులు కట్టలేని పరిస్థితులలో పాలసీదారు ఉన్నా.. లేదా అకస్మాత్తుగా డబ్బులు అవసరమైనా.. పాలసీ కోసం కట్టిన డబ్బును తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన నియమాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మూడు సంవత్సరాల తర్వాతే సరెండర్ చేయాలి:
మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే పాలసీని రద్దు చేయాలని మీరు భావిస్తే.. ఎల్ఐసి కి నిబంధనల ప్రకారం ఆ విధానాన్ని పాలసీని సరెండర్ చేయడం అంటారు. అయితే ప్రతి పాలసీకి మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ఒక పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు సరెండర్ చేయడానికి పాలసీ రూల్స్ ఒప్పుకోవు. మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే మీ పాలసీని సరెండర్ చేయడానికి వీలవుతుంది.
ఎంత డబ్బు తిరిగి వస్తుంది:
మెచ్యూరిటీ తేదీకి ముందే ఎల్ఐసి పాలసీని సరెండర్ చేయడం వల్ల ఖాతాదారులకు చాలా నష్టం జరుగుతుంది. సరెండర్ విలువ భారీగా తగ్గుతుంది. మూడు సంవత్సరాల లోపు ఆ పాలసీని సరెండర్ చేస్తే, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. అందుకే పాలసీ తేదీ నుంచి తొలి మూడేళ్ల కాలాన్ని లాక్ -ఇన్ పీరియడ్ అని చెప్పవచ్చు.