కరోనా వైరస్ సంబంధించి వైరస్ విజృంభణ నేపథ్యంలో దానిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుసూస్తున్నాయి. ఇప్పటివరకూ మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులపై వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది అనేదానిపై పలు అధ్యయనాలు తమ రిపోర్టులను వెల్లడిస్తూ.. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కరోనా ప్రభావం ఉంటుందని వెల్లడించాయి. అయితే, కరోనా వైరస్ రక్త వర్గాల అధారంగానూ ప్రభావం చూపడంలో భిన్నరకాలుగా ఉంటుందని తాజాగా పలువురు పరిశోధకులు గుర్తించారు. వివిధ రకాలైన బ్లడ్ గ్రూప్లపై కరోనా తీవ్రతలో తేడాలున్నట్టు వెల్లడించారు.
ఇదే విషయమై డెన్మార్క్, కెనడా దేశాలకు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయన రిపోర్టుల వివరాలను తాజాగా వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం.. ‘’ ఓ‘’ బ్లడ్ గ్రూప్ నకు చెందిన వారు కరోనా మహమ్మారి బారినపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసింది. డెన్మార్క్ పరిశోధకులు డానీష్ ఆరోగ్య రిజిస్ట్సీ డేటాను ఉపయోగించుకుని తమ పరిశోధనను కొనసాగించారు. దీనిలో భాగంగా కరోనా సోకిన 7422 మంది డేటాను సాధారణ జనాభాతో పోల్చారు. ఇందులో కేవలం 38 శాతం మంది మాత్రమే ఓ బ్లడ్ గ్రూప్ వారు ఉండగా.. 44 శాతం మంది ఏ బ్లడ్ గ్రూప్ వారు ఉన్నారు. అయితే, అక్కడ మొత్తం జనాభాలో 42 శాతం మంది ఓ బ్లడ్ గ్రూప్ వారున్నారు. కరోనా సోకినవారిలో ఎక్కువగా ఏ, బీ, ఏబీ, బ్లడ్ గ్రూప్ వాళ్లే ఉన్నారని తెలుస్తున్నది.
కెనడా పరిశోధకులు సైతం ఓ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. ఓ బ్లడ్ గ్రూప్ వారితో పోలిస్తే ఏబీ బ్లడ్ గ్రూప్ వారిలో కరోనా ప్రభావం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఓ గ్రూప్ వారిలో రక్తం గడ్డకట్టడమన్నది కూడా తక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ‘ఓ’ , ‘బీ’ బ్లడ్ గ్రూప్ వారు తొమ్మిది రోజుల పాటు మీడియన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే.. ఏ, ఏబీ బ్లడ్ గ్రూప్ వారు 13.5 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నట్టు గుర్తించారు. అలాగే, కరోనా సోకి వెంటిలేటర్లపై చికిత్స పొందేవారిలో ‘ఓ’ లేదా ‘బీ’ బ్లడ్ గ్రూప్ వారు 61 శాతం ఉంటే.. ‘ఏ’, ‘ఏబీ’ బ్లడ్ గ్రూప్ వారు 84 శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు.
కాగా, ఇదివరకే క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఏ బ్లడ్ గ్రూప్ సమూహం ఉన్నవారు కోవిడ్-19 సంక్రమణకు గురయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుందనీ, అయితే, ఓ రక్తవర్గం ఉన్నవారు కరోనా మహమ్మారి బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే, ఓ బ్లడ్ గ్రూప్ వారికి వైరస్ సోకినప్పటికీ.. ప్రభావమూ తక్కువగానే ఉంటుందని పేర్కొంది.