ఆదానీ గ్రుప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తొందంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో ఆ గ్రూప్ స్టాక్స్ వరుసగా కొన్ని సేషన్ల నుండి పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఎజన్సీలు స్పందించాయి. ఆదానీ గ్రూపు సంస్థలు, వాటి సెక్యురిటీస్ పై ఇప్పటికిప్పుడే ఎటువంటి ప్రభావం ఉండబోదని రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. నిధుల ప్రవాహం విషయంలో తమ అంచనాల్లో ఎలాంటి మార్పూ లేదని తెలిపింది. అలాగే స్వల్పకాలంలో ఆ గ్రూప్ నకు చెందిన ముఖ్యమైన అఫ్ ఫోర్ మెచ్యుర్ బాండ్లు ఏవీ లేదని తెలిపింది. జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పింది.

మరో ప్రముఖ రేటింగ్ ఏజన్సీ మూడీస్ స్పందించింది. ఆదానీ గ్రూప్ మొత్తం ద్రవ్య లభ్యతను అంచనా వేస్తున్నామని మూడీస్ తెలిపింది. ప్రస్తుత పరిణామాలు ఆ గ్రూప్ నిధుల సమీకరణకు అడ్డంకిగా మారనున్నాయని పేర్కొంది. రాబోయే ఒకటి రెండేళ్లలో ముందుగా నిర్దేశించుకున్న మూలధన వ్యయాలకు లేదా రుణాలను పునర్ వ్యవస్థీకరించుకోవడం కష్టం కావొచ్చని తెలిపింది. అయితే ఆదానీ గ్రుప్ కంపెనీలకు 2025 వరకూ చెల్లించాల్సిన రుణాలేవీ లేవని పేర్కొంది. అలాగే మూల ధన వ్యయాల్లో కొన్ని వాయిదా వేయదగినవిగా గుర్తించామని వెల్లడించింది. అదానీ గ్రూప్ సంస్థలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మరో రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ పేర్కొంది.
మరో పక్క ఆదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా ఈ స్టాక్స్ భారీ పతనాన్ని చవి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ ను సస్టైనబిలిటీ సూచీ నుండి తొలగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎస్అండ్ పీ డోజోన్స్ వెల్లడించింది. మరోవైపు ఆదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు శుక్రవారం 15 శాతం నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించింది. గత నెల రోజుల వ్యవధిలో ఈ స్టాక్ దాదాపు 70 శాతం కుంగిపోవడం గమనార్హం. గత ఆరు ట్రైడింగ్ సెషన్ లలో ఆదానీ గ్రూపులోని నమోదిత కెంపెనీల మార్కెట్ విలువ రూ.8.76 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

కాగా అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ఎస్బీఐకి భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయనీ, నష్టాలకు బాధ్యులు ఎవరు అంటూ వస్తున్న ఆరోపణలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓ జాతీయ మీడియా ఛానల్ కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేశ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. తమ మొత్తం పెటుబడుల్లో ఆదానీ కంపెనీల్లో ఉన్నవి చాలా తక్కువేనని ఎల్ఐసీ, ఎస్బీఐ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు.
ఇటీవల ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ఆర్ బీఐ తో నిర్వహించిన సమీక్ష తర్వాత తాను దేశ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని బాధ్యతాయుతంగా చెప్పగలుగుతున్నానని స్పష్టం చేశారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు తగ్గుతున్నాయని చెప్పారు. పరోక్షంగా ఆదానీ షేర్ల పతనం బ్యాంకింగ్ రంగంపై ఉండబోదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. విదేశీ మదుపర్లు గతంలో మాదిరిగానే నిశ్చింతగా భారత్ లో పెట్టుబడులు కొనసాగించొచ్చని సీతారామన్ తెలిపారు. నియంత్రణ, నిబంధనల విషయంలో దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్ చాలా పటిష్టంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక్క ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని భారత్ మార్కెట్లను అంచనా వేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.
Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు