Virat Kohli: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతూ ఉంది. ఆదివారం కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 243 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్ లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్ లలో 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఇలా ఉంటే భారత్ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ తన పుట్టినరోజు నాడు ఆదివారం అంతర్జాతీయ వన్డే లలో సచిన్ నమోదు చేసిన 49 సెంచరీల రికార్డును సమం చేశాడు.
దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తన 49వ సెంచరీ సాధించాడు. ముంబైలో వాంకాడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆ రికార్డు అందుకుంటాడని అందరూ భావించగా 90 పరుగుల తర్వాత సెంచరీ చేయకముందు అవుట్ అవ్వడం జరిగింది. కాగా సరిగ్గా తన పుట్టినరోజు నాడు నవంబర్ ఐదు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆ ఫీట్ అందుకున్నారు. దీంతో కోహ్లీ తన ఘనతను అందుకోవటం పట్ల సచిన్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. బాగా ఆడావు విరాట్ అంటూ హృదయపూర్వకంగా అభినందించారు. ఇదే సమయంలో కోహ్లీ పుట్టినరోజు ప్రస్తావిస్తూ కూడా చమత్కారంగా వ్యాఖ్యానించారు.
” నేను 49 నుంచి 50 ఏళ్ల వయసుకు చేరుకునేందుకు 365 రోజులు పట్టింది. కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50 కి చేరుకోవాలని కోరుకుంటున్నాను.. తద్వారా నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్ పెట్టారు. మరోపక్క ఈ రికార్డు అందుకోవటం పట్ల మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ సచిన్ పై ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. “నా హీరో రికార్డును సమం చేయడం గౌరవం. చాలామంది అభిమానులు పోల్చుతూ ఉంటారు. కానీ నేను ఆయనలా ఎప్పటికీ రాణించలేను. మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ లో చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే నేను టీవీలో ఆయన ఆట చూస్తూ పెరిగా.. నా గురించి నాకు బాగా తెలుసు. కానీ జీవితంలో ఇది నాకు ఒక భావోద్వేగా క్షణం అని.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.