మొన్నామధ్య అల్లు అరవింద్ కి చెందిన ప్రముఖ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థ నుండి మీకు వారు భవిష్యత్తులో తీయబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లలో హీరో హీరోయిన్లుగా ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఒక బృందం తయారైన విషయం తెలిసిందే. అయితే వారికి మాకు ఎటువంటి సంబంధం లేదని గీతాఆర్ట్స్ తేల్చి చెప్పేసింది. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటివి ఇండస్ట్రీలో కోకొల్లలు.
ఈరోజు టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి త్వరగా ఇలాంటివి ఆదిలోనే కనుకుంటున్నారు కానీ గతంలో ఒక హిట్ సినిమాను దర్శకుడు తీశాడు అంటే… అతని పేరుమీద పక్క వీధిలోనే యాక్టింగ్ స్కూల్ ప్రారంభించిన రోజులు ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీలో ఎన్నో మోసాలు, కుట్రలు, స్కామ్ లు, స్కీమ్ లు సర్వసాధారణం. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘హారిక హాసిని క్రియేషన్స్’ వారి సంస్థ పేరుని అడ్డంపెట్టుకుని కూడా కొంత మంది ఇలాగే కొన్ని మోసాలకు పాల్పడుతున్నారు అన్న విషయం బయటికి వచ్చింది. అందులోనూ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ పేరుని అడ్డంపెట్టుకుని మనుషులని హారిక హాసిని క్రియేషన్స్ తో త్రివిక్రమ్ కి ఉన్న అనుబంధాన్ని సాకుగా చూపించి త్రివిక్రమ్ సినిమాలో మీకు ఛాన్స్ ఇప్పిస్తామని ఎంతో మందిని మోసం చేస్తున్నారు ఒక బ్యాచ్.
ఇది కాస్తా హారిక హాసిని క్రియేషన్స్ వారికి తెలిసింది. దాని తర్వాత ఆటోమేటిక్ గా ‘మాటల మాంత్రికుడి’ వద్దకు ఈ వార్తలు వెళ్లిపోయాయి. అంతే… ఒక్కసారిగా ఖంగు తినడం ఆయన వంతు అయింది. వెంటనే హారిక హాసిని క్రియేషన్స్ వారితో చర్చించి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని…. వారు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పారట. ఇలాంటివి సర్వ సాధారణం కావడంతో హారిక హాసిని వారు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకోమని చెప్పి తదుపరి విషయాలను తాము చూసుకుంటామని ధైర్యం చెప్పారట.
అంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీ…. దానితో వరుసగా సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్ ను అడ్డంపెట్టుకుని ఇలాంటి మోసాలకు పాల్పడడం చాలా సులువు అని ఎంతోమంది నిరూపిస్తూనే ఉన్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న టాలీవుడ్ ప్రజలకు సుపరిచితమైన గాయని.. సింగర్ సునీత పేరుని అడ్డంపెట్టుకుని…. ఆమె మేనల్లుడిని అంటూ సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తానంటూ ఎవరో ఫేస్ బుక్ లో డబ్బులు తీసుకొని మోసం చేయడం కూడా తాజాగా చూశాం. కాబట్టి ఇండస్ట్రీ పైన మక్కువ ఉండే వాళ్ళు టీవీ ఛానళ్ళలో వచ్చే ప్రకటనలను లేదా ఒక సంస్థ నుండి అధికారికంగా వెలువడిన ప్రకటనలను మాత్రమే నమ్మాలని ఎవరైనా ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఇంకా మోసపోతున్నారు అంటే అది ముమ్మటికీ మీ తప్పిదమే.