‘ఆపరేషన్’కి ముందు ఇచ్చిన మత్తుమందు ఎక్కువై మృతిచెందిన మహిళ!

థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళకు అనస్థీషియా మోతాదు ఎక్కువ కావడం వల్ల మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా, సింగనమల మండలం, శ్రీపురం గ్రామంలో నివసించే రాధా అనే వివాహిత గత కొద్దిరోజులుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది.

 

అయితే చికిత్స కోసం స్థానిక అనంతపురంలోని శ్రీనివాస హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి, ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ కి ముందు అనస్తీషియా ఇంజక్షన్ ఇచ్చారు. సడన్ గా ఆమె పరిస్థితి విషమించి, ప్రాణాలు కోల్పోయింది. అధిక మోతాదులో అనస్తీషియా ఇవ్వడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిందని, మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాధ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం, ఆమెకు గుండెపోటు రావడంతో అపస్మారక స్థితికి వెళ్లి మరణించిందని, ఇందులో మా తప్పిదం లేదంటూ డాక్టర్లు చెప్పారు. కాగా మృతురాలికి నలుగురు సంతానం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.