జగన్ మంత్రాలు వింటే షాకవ్వాల్సిందే అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డిక్లరేషన్ వివాదం గురించి భారీగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు డిక్లరేషన్ కోసం పట్టుబట్టగా జగన్ మాత్రం డిక్లరేషన్ పై సంతకం చేయకుండానే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లారు. తిరుమల దర్శనానికి జగన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

 

తాజాగా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ మంత్రాలు వింటే షాక్ అవ్వాల్సిందేనని చెప్పారు. జగన్ ఆహార్యం చూస్తే అందరూ బ్రాహ్మణుడి పుత్రుడు అనుకున్నారని.. ఆయన మంత్రాలు చదువుతుంటే అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. హిందువునే అయినప్పటికీ తనకు మంత్రాలు చదవటం రాదని ఎమ్మెల్యే వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మతాన్ని అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు.

చంద్రబాబు ఇలా మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు. చంద్రబాబు గారు షూ విప్పి పూజించడం నేర్చుకోవాలని.. జగన్ గారు నామం పెట్టుకున్నా వివాదం సృష్టిస్తారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓటమిపాలు కాగానే హైదరాబాద్ కు వెళ్లిపోయారని విమర్శలు చేశారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండకుండా రాష్ట్రానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు.

కరోనా లాక్ డౌన్ కాస్తా అన్ లాక్ అయిన తరువాతైనా చంద్రబాబు రాష్ట్రానికి వస్తే బాగుంటుందని హితవు పలికారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.