మీరే స్వరకర్తలు కావచ్చు..! స్వర ప్రపంచం మీకు స్వాగతం పలుకుతుంది..!

 

సంగీతం…మనస్సులోని కల్లోలానికి విరుగుడు. …బాధలను మరిపించే మందు…. జవసత్వాలను ఉత్తేజపరిచే వ్యాయామం. ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతం దివ్యౌషధం. పెళ్లయిన-పేరంటమయినా, విందైనా-వినోదమైన, ఆటైనా-పాటైనా, సందర్భం ఏదైనా సంగీతం ఉండాల్సిందే…!
ఈ రంగంలో కోర్సులు, కెరియర్‌ అవకాశాలు ఇలా..

ఈ ప్రపంచంలో సంగీతాన్ని ఆస్వాదించలేని వారు ఎవరన్నా ఉన్నారంటే వారు తోక, కొమ్ములు లేని జంతువులతో సమానం అంటారు షేక్‌స్పియర్‌. మనిషి మాటతోపాటూ పాటనూ నేర్చుకున్నాడు. సంగీతంలో రకరకాల ప్రక్రియలు పురుడుపోసుకున్నాయి. ఏ దేశ సంగీతానికైనా “స రి గ మ ప ద ని” ఈ సప్త స్వరాలే మూలం. ఇవే ఆధారం. వినసొంపైన ప్రతి సంగీతం ఆమోదయోగ్యమే. మనిషి జీవితంలో ఓ అంతర్భాగం సంగీతం. బహు చక్కని భారతీయ సంగీతం. ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఓ ప్రత్యేక స్థానం.ఈ మధ్యకాలంలో పాప్‌, రాక్‌బ్యాండ్‌, బ్రాస్‌బ్యాండ్‌, ఫ్యూజిన్‌, ఇండిపాప్‌ వంటివి బాగా యువతను ఆకట్టుకుంటున్నాయి. అందుకే సినిమాల్లో సైతం ఫాస్ట్‌బీట్‌లే ఎక్కువగా వస్తున్నాయి. శాస్త్రీయ సంగీతం, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుందని హెల్సింకీ యూనివర్సిటీ వారి పరిశోధనలలో సైతం తేలింది. ఆటిజం చిన్నారులకు, కేన్సర్‌ చికిత్స పొందుతున్న వారికి మ్యూజిక్‌ థెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుందని బ్రిటీష్‌ జనరల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి.సందర్భం ఎలాంటిదైనప్పటికీ మ్యూజిక్‌ తప్పనిసరైంది. దీంతో గాయకులకు, మ్యుజీషియన్లకు డిమాండ్‌ పెరిగింది. బ్యాండు పార్టీలు, ఆర్కెస్ట్రాలు, డీజే, బుల్లితెర, వెండితెర అన్నిచోట్లా శ్రుతి లయలు తెలిసినవారికి అవకాశాలు అందిపుచ్చుకుంటునారు. ఈ రంగంలో సంగీత కోర్సులు, కెరియర్‌ అవకాశాలు ఇలా..

సింగర్‌ / మ్యుజీషియన్‌
పాట పాడాలనే లక్ష్యంతో ఎక్కువ మంది పాటల ప్రపంచంలోకి వచ్చారు. ఎన్నో సంస్థలు చిన్నప్పటి నుంచే శిక్షణనందిస్తున్నాయి. టెలివిజన్‌ ఛానెళ్లు పోటీలు నిర్వహించి సృజనాత్మకతను వెలుగులోకి తెస్తున్నాయి. బుల్లితెరపై మెరిసినవారు వెండితెరపై అవకాశాలు అందుకుంటారు. అలా కాకపోతే అలా కాకపోతే ఆర్కెస్ట్రా, బ్యాండ్, డీజే, బుల్లితెరపై రాణిస్తున్నారు. ఇలా సంగీత ప్రపంచంలో సత్తా చాటడానికి వివిధ మార్గాలు, వేదికలు సిద్ధమై ఉన్నాయి. శ్రావ్యమైన గొంతు, స్పష్టంగా ఉచ్చరించడం, హుషారు, కొద్దిగా నృత్యంలో నైపుణ్యం ఉన్నవారు సింగర్‌ గాను రాణిస్తారు. గుర్తింపు పొందడానికి గొంతులో కొత్తదనం, ప్రత్యేకత తప్పనిసరి. గొంతులో వైవిధ్యాన్ని ప్రదర్శించగలగాలి. సంగీతాన్ని ఉపయోగించి మానసిక సాంత్వన చేకూర్చేవారే మ్యూజిక్‌ థెరపిస్టులు. ఉద్రేకాలను తగ్గించడం, ఆలోచనలను అదుపులోకి తీసుకురావడం, వివిధ బాధల నుంచి ఉపశమనం పొందేలా చేయడంలో మ్యూజిక్‌ థెరపీ ఉపయోగపడుతుంది. సంగీతంలో పూర్తి పట్టున్నవారు మ్యూజిక్‌ థెరపిస్టులుగా రాణించవచ్చు.

కంపోజర్స్ గేయానికి తగిన సంగీతాన్ని అందిస్తారు. వీరికి విభిన్న రకాల సంగీత వాద్యాలపై అవగాన ఉండాలి. పాట నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుస్వరాలను సృజించాలి. పాటకు న్యాయం జరగాలంటే కంపోజర్ల నైపుణ్యమే కీలకం. సంగీతం, శబ్దంలో కొత్తదనాన్ని సృష్టించాలి. అది వీనుల విందు కావాలి. సంగీతానికి వివిధ వాద్యాలే ప్రాణం. పాటకూ, సందర్భానికీ తగ్గ మ్యూజిక్‌ ఉంటేనే కార్యక్రమం రక్తి కట్టగలదు. సందర్భాన్ని బట్టి ఒకటి లేదా కొన్ని పరికరాలు అవసరమవుతాయి. అందువల్ల ప్రొఫెషనల్‌ ఇన్‌స్ట్రుమెంటలిస్టుగా రాణించడానికి ఏదైనా ఒక సంగీత పరికరంపై పూర్తి పట్టు తప్పనిసరి. దాన్ని ఉపయోగించి కొత్త ధ్వనులను సృష్టించగలగాలి. ఒక గొప్ప గాయకుడు ఆవిర్భవించడానికి ముందు గొప్ప పాటల రచయిత ఉండాలి. ఆ రచనతోనే పాటలు పాడేవారికీ, సంగీతాన్ని సమకూర్చేవారికీ గుర్తింపు లభిస్తుంది. భాషపై పట్టు, అద్భుతమైన సృజన, విస్తృత పద సంపద, ఇతర భాషలపై అవగాహన, సామాజిక పరిస్థితులు, ప్రస్తుత అవసరాలు, అన్నీ తెలియాలి. వీరు మ్యూజిక్‌ పబ్లిషర్లు, రికార్డు కంపెనీలు, ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్, రికార్డింగ్‌ గ్రూప్‌లతో కలిసి పనిచేయాలి. సినిమా, సీరియల్‌ నిర్మాణ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌

వీరు పాటలను ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం గాయకులు, మ్యుజీషియన్లు, టెక్నీషియన్లు అందరినీ సమన్వయం చేస్తారు. చివరిగా పాటల ఆల్బమ్‌, సీడీ రిలీజ్ చేస్తారు. ఏ పాట ఉండాలి, దానికి ఏ స్థాయిలో శబ్దం అవసరం, ఎవరైతే బాగా పాడగలరు, వంటి విషయాలు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వీరికి సంగీతానికి చెందిన అన్ని విభాగాలపైనా అవగాహన ఉన్నప్పుడే రాణించగలరు.మ్యూజిక్‌ లాయర్లు వీరు మ్యూజిక్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తారు. ముఖ్యంగా చట్టపరంగా కాపీ రైట్‌ సమస్యలు లేకుండా చూస్తారు.రాక్‌ బ్యాండ్లు, ఆర్కెస్ట్రాలు మొదలుకొని సినీ పరిశ్రమ వరకు మ్యూజిక్‌ రికార్డు చేయడం తప్పనిసరి. ఇందుకోసం రికార్డింగ్‌ నైపుణ్యం ఉండాలి. ఈ పని సవ్యంగా పూర్తికావడానికి హైటెక్‌ పరికరాలు, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. వాటిని సమన్వయంతో ఉపయోగించి శ్రోతలు మెచ్చేలా రికార్డు చేయాలి. స్వరాలతో సమ్మిళితం చేసి కమ్మని శబ్దాలను శ్రావ్యమైన స్థాయిలో అందించడంలో రికార్డర్ల సేవలు ముఖ్యమైనది. ఆ సంగీతాన్ని సీడీలు, పెన్‌ డ్రైవ్‌ల రూపంలో ప్రమేషన్ బాధ్యత రికార్డింగ్‌ టెక్నీషియన్లదే.అందరూ, అన్ని విభాగాలూ సమన్వయంతో ముందుకు సాగడంలో కండక్టర్ల బాధ్యతే కీలకం. వీరికి అన్ని విభాగాలపైనా పట్టు ఉండాలి. ఆర్కెస్ట్రా, బ్యాండ్‌లో బలహీనతలు గుర్తించి అందుకు తగ్గ మార్పులు చేయగలిగే సమర్థత వీరికి ఉండాలి.

టెక్నీషియన్లు సంగీతానికి కావాల్సిన సౌండ్‌ ఎఫెక్ట్‌ని వీరు చూసుకుంటారు. ఇందుకోసం వివిధ పరికరాలు అవసరమవుతాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి వినసొంపైన శబ్దాన్ని అందిస్తారు. సినిమాకైతే ముందుగానే ఈ క్రతువు పూర్తవుతుంది. అదే ఆర్కెస్ట్రా లైవ్‌ పెర్‌ఫామెన్స్‌ లాంటివాటికైతే వేదికపైనే వీరు కూడా పనిచేసి శబ్దాలను శ్రుతి లయలతో సమన్వయం చేస్తారు. అందులోని లోపాలను గుర్తించగలిగే నైపుణ్యం ఉంటుంది. ప్రేక్షక శ్రోతలూ, సంగీత సిబ్బందిల మధ్య సంధానకర్తలు వీరు. ప్రింట్, బ్రాడ్‌ కాస్ట్, ఆన్‌లైన్‌ మీడియాల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. వీరు ఫ్రీలాన్సర్లుగానూ రాణించవచ్చు.కమ్మని సంగీతాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడం పబ్లిసిస్టుల బాధ్యత. వీరికి సంగీతంలో నైపుణ్యం లేనప్పటికీ పత్రికల్లో ఇంటర్వ్యూలు, టీవీలో సంబంధిత కార్యక్రమం వచ్చేలా చేయడం, ఆన్‌లైన్‌ ప్రమోషన్‌…చూసుకుంటారు.

సంస్థలు :
ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, క్రైస్ట్‌ యూనివర్సిటీ, సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, త్యాగరాజ సంగీత కళాశాల, ఏఆర్‌ రెహమాన్‌ కేఆర్‌ మ్యూజిక్‌ కన్జర్వేటరీ, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పంజాబ్‌ యూనివర్సిటీ, ముంబయి యూనివర్సిటీ… సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టొరేట్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌ తర్వాత డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరవచ్చు. కలకత్తా స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్, బెంగాల్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్, తమిళనాడు మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ.. తదితర సంస్థల్లోనూ చదువుకోవచ్చు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీలో 6, తెలంగాణలో 6 కళాశాలలు సంగీతం, నృత్యం విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటనలు వెలువడ్డాయి. ఏపీలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, విజయనగరంలో ఈ కాలేజీలు ఉన్నాయి. నవంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ల్లో వీటిని నెలకొల్పారు. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 31లోగా వివరాలు నమోదు చేసుకోవాలి.