వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

23 Feb, 2020 - 03:29 PM

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందిన బాహుబలి సినిమా టైటిల్ సాంగ్ తో ట్రంప్ పై రూపొందించిన ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రభాస్‌ ముఖానికి ట్రంప్‌ ముఖాన్ని అతికించి బ్యాక్‌గ్రౌండ్‌లో ‘జియోరే బాహుబలి’ సాంగ్‌ను పెట్టారు. దీంతో పాటు ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ను వీడియోలో చూపించారు. అలాగే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను తండ్రి ట్రంప్‌ భుజాల మీద ఎత్తుకున్నట్లు చూపించారు. ఇక చివరలో శుభం కార్డు లాగా ఈ వీడియోలో కూడా ‘యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్’ అని చూపించడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోపై ట్రంప్‌ స్పందించారు. ‘భారత్‌లో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ’ రీట్వీట్ చేయడం గమనార్హం.