రైతు ఆదాయాన్ని రెట్టింపు చేశాం: చంద్రబాబు

అమరావతి, డిసెంబర్ 26: రాష్ర్టంలో రైతాంగానికి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రైతు సంక్షేమంపైన 4వ శ్వేతపత్రాన్ని సిఎం విడుదల చేశారు. తాము చేపట్టిన చర్ల ఫలితంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆయన అన్నారు. వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి సిఎం వివరించారు. కేంద్రం, ఆర్‌బిఐ అంక్షలు విధించినప్పటికీ రైతులకు 24వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. దేశంలో మరే రాష్ర్టం చేయని విధంగా ప్రతి రైతుకూ లక్షన్నర రూపాయల వరకూ రుణాలను పూర్తిగా మాఫీ చేశామన్నారు.
రైతులకు 5,500 కోట్లు రూపాయల మేరకు నాలుగు ఏళ్ళలో ఇన్‌పుట్ సబ్సిడి అందజేశామన్నారు. రాష్ర్టంలో 17 ప్రాజెక్టులు పూర్తి కాగా ఆరు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా వున్నాయన్నారు. వరి,వాణిజ్య పంటలతోపాటుగా ఉద్యానపంటలకు అదనపు ప్రోత్సాహం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2.4 శాతం అభివృద్ది రేటు వుండగా మన రాష్ర్టంలో అది 11 శాతం ఉందని అన్నారు.
2కోట్ల ఎకరాలకు నీరు
వ్యవసాయరంగాన్ని పూర్తిగా ఆదుకునేందుకు రానున్న సీజన్‌లో 2కోట్ల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి, కృష్ణా నదినుంచి శ్రీశైలం ప్రాజెక్టుద్వారా రాయలసీమకు నీటిని తరలించినట్లు తెలిపారు. రాయలసీమకు నీరందించిన ఘనత తమదేన్నారు. దీంతో అనంతరంపురం, కడప జిల్లాల్లో సాగు, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయగలిగామని అన్నారు. ప్రతి ఒక్క ఎకరానికి సాగునీరు అందించాలన్న ప్రణాళికతో ముందుకుసాగనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో వ్యవసాయానికి 2.52 లక్షల కోట్లు వ్యయం చేయగా, దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలురైతాంగానికి రూ 9,411 కోట్లు ఇచ్చమని చెప్పారు. దీనివల్ల 25 లక్షల మంది రైతాంగానికి మేలు చేకూరిందన్నారు. రాష్ర్టంలో ఎన్నికలకు ముందుకు రైతాంగాన్ని ఆదుకునేందుకు రుణమాఫీపై హామీ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినా దేశ మొత్తం చేయాలంటూ దాటవేశారని, అయినప్పటికీ తాను రాష్ర్టంలో రుణామాఫీ చేపట్టాననీ తెలిపారు.