ఉత్తర్వులు సరైనవే: ట్విటర్లో అరుణ్ జైట్లీ

37 views


దర్యాప్తు సంస్థలకు ఏ కంప్యూటర్‌లోని సమాచారాన్నైనా నియంత్రించే అధికారాన్ని కట్టబెడుతూ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సరైనవేనంటూ జైట్లీ ట్విటర్‌ వేదికగా గురువారం అభిప్రాయంవ్యక్తం చేశారు. నిఘా ఉత్తర్వుల నేపధ్యంలో వివాదం చోటుచేసుకుంటున్న తరుణంలోప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి చేసేందుకు ఉగ్రవాదుల కుట్రను పసిగట్టి భగ్నంచేసిన అంశం జైట్లీకి ఒక అస్ర్తంగా లభించింది. కుట్రనుభగ్నం చేసినందుకు ఎన్‌ఐఏను అభినందించారు. ప్రతిపక్ష పార్టీలు నిఘా ఉత్తర్వులపై భగ్గుమన్న నేపధ్యంలో కంప్యూటర్, ఫోన్‌ల సమాచారాన్ని తెలుసుకోకుండా ఈ కుట్రను పసిగట్టగలిగేవాళ్లమా? అని జైట్లీ ప్రశ్నించారు . ‘‘ జాతీయ భద్రత, సార్వభౌమత్వానికే అత్యంత ప్రాముఖ్యమనీ, వ్యక్తి స్వేచ్ఛ శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలోనే సాధ్యమనీ ఉగ్రవాద రాజ్యంలో దానికి చోటుండదు’’ అని జైట్లీ పేర్కొన్నారు.

బుధవారం ఎన్‌ఐఏ 17 చోట్ల సోదాలు జరిపి, 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఆ సోదాల్లో దేశవాళీ ఆయుధాలు, ఇంకా పరీక్షించని రాకెట్ లాంచర్‌, బాంబుల తయారీకి ఉపయోగించే పొటాషియం నైట్రేట్‌, పొటాషియం క్లోరేట్, షుగర్‌ పేస్ట్  వంటి పదార్థాలు, ఆత్మాహుతి జాకెట్లకు సంబంధించిన వస్తువులు, బాంబుల్లో టైమర్లుగా ఉపయోగపడే 100 అలారం గడియారాలు, రూ.7.5 లక్షల నగదు, 100 మొబైల్‌ ఫోన్లు, 135 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.