కడప స్టీల్ రమేష్ కోసమే? విజయసాయిరెడ్డి

ఢిల్లీ, అమరావతి 28: కడప స్టీల్ ఫ్యాక్టరీ కేవలం సిఎం రమేష్‌దేనని  వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ ఆవరణలో జాతిపిత మహత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లేకార్డుతో వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి , ప్రభాకరరెడ్డి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం కడప స్టీలు ప్లాంట్ వ్యయం 18వేల కోట్ల రూపాయలని ప్రకటించినప్పుడు కనీసం దీనిని నిర్మించాల్సింది కేంద్ర ప్రభుత్వమన్న విషయం ఎందుకు తెలియదు. ఇదే విధంగా కేంద్రం కట్టాల్సినవన్నీ మీరే కడతారా అని ప్రశ్నించారు. ఈ ఫ్యాక్టరీ కేవలం చంద్రబాబు బినామీగా చెలామణి అవుతున్న సిఎం రమేష్‌దిగా  పేర్కొన్నారు. ఇది కేవలం రమేష్ రియల్ ఎస్టేట్ కోసమేనని ఆరోపించారు.
అంతా గ్రాఫిక్స్
రాజధాని విషయంలో సింఎం చంద్రబాబునాయుడు ఏం చేశారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 48వేల కోట్ల రూపాయల ఖర్చుగా అంచనా వేశారని, ప్రపంచంలో మంచి భవనాలు గ్రాఫిక్స్ రూపంలో తీసుకువచ్చి చూపించడం తప్ప, కనీసం వాటికి సంబంధించిన నివేదికలు ఏమాత్రం లేవన్నారు. ఈ నిరసనలో మాజీ ఎంపి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.