చంద్రబాబు ఏమనుకొని ఉండాలి?

Share

ఒక తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రెండవ తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల వంటి జటిల సమస్యలపై తగాదాలు వస్తాయని అందరూ అనుకున్నదే. అయితే ఇద్దరు చంద్రుల మధ్య అత్తా కోడలు తరహా పోరు తప్పదని తేలడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య వైరం నిన్నటి కెసిఆర్ మీడియో గోష్టితో ఒక కొత్త మలుపు తిరిగింది. నీచ రాజకీయ నాయకుడు అన్న మాట చిన్న మాట కాదు కదా. ఇద్దరి మధ్యా రాజకీయ విబేధాలు ఎన్నయినా ఉండొచ్చు. ఎంత తీవ్రమైన విమర్శ అయినా చేయవచ్చు. ఆ విమర్శలు వ్యక్తిగతంగా మారినపుడు మాత్రం తర్వాతి రాజకీయాలు కూడా భిన్నంగా మారతాయి.

కెసిఆర్ నోటి వెంట మాటలు ప్రవాహంలా వచ్చిపడతాయి. ఒకసారి ఆ ధోరణిలోకి వెళ్లారంటే ఇక అడ్డం ఉండదు. కవిత్వం రావాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలో చెబుతూ అల్లసాని పెద్దన రమణీయ స్థలము…అంటూ ఒక గొప్ప పద్యం రాసారు. కెసిఆర్‌కు తిట్టు కవిత్వం ధోరణిలోకి వెళ్లడానికి పెద్దన గారు వర్ణించినవేవీ అక్కరలేదు. అది మీడియా సమావేశమయితే చాలు.

నిన్న ఆయన చంద్రబాబును పట్టుకుని తిట్టే ధోరణి చూడాలి. లఫంగా అన్నారు. డర్టీయెస్ట్ పొలిటీషయన్ అన్నారు. అబద్ధాలకోరు అన్నారు. దద్దమ్మ అన్నారు. మెదడు లేదన్నారు. సిగ్గూ లజ్జా లేవన్నారు. కెసిఆర్‌ తిట్ల పురాణం తెలుగు ప్రజలకు కొత్త కాదు. అయితే ఈసారి మరీ రెచ్చిపోయారు. గొప్ప మెజారీటీతో తెలంగాణాలో అధికారాన్ని మళ్లీ చేపట్టిన ఊపు కావచ్చు! అది కూడా చంద్రబాబు వచ్చి స్వయంగా నాలుగు రోజుల పాటు ప్రచారం చేసిన తర్వాత లభించిన విజయం కదా!

మరి చంద్రబాబు సంగతేమిటి? కెసిఆర్ విమర్శలు ఆయనకు ఏ విధంగా తగిలి ఉండాలి? కెసిఆర్ చంద్రబాబును తిట్డడంతో సరిపెట్టలేదు. రాఫ్ట్ ఫౌండేషన్ గురించి లేని గొప్పలు చెబుతున్నారని అన్నారు. వరుసగా విడుదల చేసిన శ్వేతపత్రాలను డబ్బా కొట్టుకోవడం అన్నారు. హోదాపై నాటకం ఆడుతున్నాడని అన్నారు. ఆర్ధికలోటుపై అబద్ధాలు ఆడుతున్నాడని అన్నారు. ఐటిలో చేసిందేమీ లేదు ప్రచారం తప్ప అన్నారు. రుణమాఫీ మాట మోసమన్నారు.

ఈ విమర్శల్లో నిజమెంత, కానిదెంత అన్నమాట అలా ఉంచితే విమర్శల్లో చాలా పదును ఉంది. వ్యక్తిగతంగా దూషించిన దానికన్నా ఈ విమర్శలు చంద్రబాబును ఎక్కువగా బాధించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం అయిన వైఎస్‌ఆర్‌సిపి చంద్రబాబును టార్గెట్ చెయ్యడం అన్న ఏకసూత్రంతో ముందుకు  నడుస్తున్నది. ఆ పని సక్సెస్‌పుల్‌గా చేయగలిగితే ఎన్నికల్లో గెలుస్తామని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. పాదయాత్రలో వైఎస్‌ జగన్ వరాల జల్లు కురిపిస్తున్న మాట నిజమే కానీ, దాని కన్నా ముఖ్యమంత్రిని అబద్ధాలకోరుగా, దివాళాకోరుగా చిత్రిస్తూ చేసే విమర్శల జడివానే ముఖ్యమైనది. నిన్న కెసిఆర్ చేసిన విమర్శలు అన్నీ ఇంతకుముందు జగన్ వరసగా అంటూ  వస్తున్న మాటలే. అందుకే ఆ విమర్శలు చంద్రబాబు నాయుడిని ఎక్కువ బాధించి ఉండాలి.


Share

Related posts

జగన్ లేఖ..! ఢిల్లీ బార్ అసోసియేషన్ లో విబేధాలు..!!

Special Bureau

జగన్ ప్రభుత్వానికి షాక్!

somaraju sharma

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

Mahesh

Leave a Comment