అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

పొలిటికల్ మిర్రర్ 

“అనగనగా ఓ ఐటీ అధికారి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మాట్లాడారట. చంద్రబాబు బృందంలోని కొందరు నాయకుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరిగిన తనిఖీల్లో ఏమి బయటపడలేదని చెప్పారట. అసలు రూ. 2 వేల కోట్లు అనధికార లావాదేవీలు అనడానికి ఆధారాలు లేవని, వీటిని రుజువు చేయలేమని, అసలు ఆ కంపెనీల టర్నోవరే అంత ఉండదని తేల్చి చెప్పేశారట. ఇవి పట్టుకుని లోకేష్ ని అరెస్ట్ చేయలేమని, మీ వాడ్ని ధైర్యంగా ఉండమని భరోసా కూడా ఇచ్చేసారట” ఆర్కే కొత్త పలుకులో ఇవన్నీ పలికారు. పాపం ఇది తెలియక టిడిపి బ్యాచ్ తెగ కంగారు పడుతోంది. లోకేష్ ని ఎక్కడ అరెస్టు చేసేస్తారో అని…! అందుకే రాధాకృష్ణ లాంటి వారిని ఒకరిని పెట్టుకుంటే ఇలా తమకు కావాల్సిన, అనుకూల నిజాలను లాక్కొస్తారు”

చంద్రబాబు బృందం ఇళ్లల్లో ఐటీ అధికారుల తనిఖీలు… రూ రెండు వేల కోట్ల అనధికార లెక్కలు గుర్తింపు. ఈ వార్త రెండు రోజుల నుండి రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్.., తెలంగాణలో కేసీఆర్ సన్నిహితుడు ప్రతిమ కంపెనీ అధినేత శ్రీనివాస్ ఇంట్లోనూ, కార్యాలయాల్లోనూ జరిగాయని చెప్తున్నారు. ఎక్కడో, ఎలాగో రూ. 2 వేల కోట్ల మాత్రం అవినీతిని గుర్తించినట్టు ఐటీ అధికారులు ప్రకటన రూపంలో బయటపెట్టారు. అంటే 2 వేల కోట్లు అనేది మాత్రం నిజం. అది ఐటీ అధికారులే ప్రకటన ద్వారా ధృవీకరించారు. మరి దీనికి విరుద్ధంగా లాజిక్ లేకుండా రాధాకృష్ణ తో మాట్లాడిన ఐటీ అధికారి దీన్ని నిరూపించలేం, ఆధారాలు లేవు, అసలు వాటి టర్నోవరే అంత ఉండదు అని చెప్పడమేంటి..? ఇదే గమ్మత్తు. టిడిపి శ్రేణులను సంతృప్తి పరిచే క్రమంలో ఆంధ్రజ్యోతిలో ఇటువంటి వార్తలు సహజమే. అయినా ఐటీ అధికారుల తనిఖీల్లో తను వాస్తవాలు తేల్చేసినట్టు, ఆ రెండు వేల కోట్లు అబద్ధమని ఊదరగొట్టడమే ఆ కొత్తపలుకులో అంతరార్ధం.

 

అసలు ఆ నోట్ లో నిజాలుకి, ఐటీ అధికారి చెప్పారంటున్న రాధాకృష్ణ చెప్పిన కొత్త పలుకులో నిజాలకి తేడాలున్నాయి. ఉదాహరణగా “ఆ కంపెనీల టర్నోవర్ మొత్తం రూ. 2 వేల కోట్లు ఉండదని, సబ్ కాంట్రాక్టర్ల విలువ మొత్తం కలుపుకుని అంత ఉంటుందని” కొత్త పలుకులో పేర్కొన్నారు. ఇక్కడ ఆ నోట్ లో అంశాలను ఒకసారి పరిశీలిస్తే… “మేజర్ రాకెట్ ఆఫ్ క్యాష్ జనరేషన్ త్రు బోగస్ సబ్ కాంట్రాక్టర్స్, ఓవర్ ఇన్వోయిసింగ్ అండ్ బోగస్ బిల్లింగ్” అని పేర్కొన్నారు. అంటే ఆ సబ్ కాంట్రాక్టర్లు బోగస్ అని ఐటీ అధికారులు తేల్చారు. కానీ ఆర్కే పలుకులో వాటిని అధికారికంగా చూపారు. ఆదాయ పన్ను నుండి తప్పించుకోడానికి చిన్న చిన్న కంపెనీలను సృష్టించి రూ. 2 కోట్లు లోపు లావాదేవీలు జరిపి, అక్రమాలకు పాల్పడ్డారని నోట్ లో పేర్కొన్నారు. కానీ ఈ ఐటీ ఈ ఫైలింగ్ మొత్తం సదరు కార్పొరేట్ కంపెనీ నుండి జరిగినట్టు ఐపీ అడ్రెస్ ల ద్వారా తెలిసినట్టు నోట్ లో ఉంది. ఇవేమీ రాధాకృష్ణ తేల్చిన నిజాల్లో పేర్కొనలేదు. మరీ ముఖ్యంగా రూ. 85 లక్షలు లెక్కల్లో లేని నగదు, రూ. 71 లక్షల విలువైన నగలు సీజ్ చేశారు. 25 బ్యాంక్ లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిజాలు ఆర్కే నిజాలో లేకపోవడమే ఇక్కడ టిడిపి శ్రేణులను సంతోషపెడుతుంది. తటస్థూలకు రోత పుడుతుంది.

శ్రీనివాస్ మానెం