కార్మిక సంఘాల బంద్

ఢిల్లీ, జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం కార్మిక సంఘాలు బంద్ చేపట్టాయి. దేశ వ్యాప్తంగా పది కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె పిలుపు మేరకు ఏకపక్ష కార్మిక చట్టాల సంస్కరణలను నిరసిస్తూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ బంద్‌లో సుమారు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాతోపాటుగా అసన్‌సోల్ , హుగ్లీ జిల్లాల్లో పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకన్నాయి. పలు చోట్ల రైళ్ల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. చాలాచోట్ల సిపిఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బరస్సాత్‌లో స్కూల్ బస్సును ఆందోళన కారులు ధ్వంసం చేశారు.
ఒడిశాలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్ సభ్యులు భువనేశ్వర్‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. రైలు పట్టాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మహారాష్ర్టలోని బృహన్‌ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్, ట్రాన్స్‌పోర్టు బంద్ వల్ల ముంబాయిలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక సంఘాల సభ్యులు రహదారులపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి.
కార్మికుల సమ్మెకు మద్దతుగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు, రైతులు కూడా మద్దతు పలికారు. బ్యాకు ఉద్యోగుల సంఘం కూడా సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగింది.