యోగీ ఆదిత్యనాథ్…మానవహక్కులు!

యోగీ ఆదిత్యనాథ్‌కు చట్టం అంటే గౌరవం ఎప్పుడూ లేదు. ఆయన అవడానికి యోగి. కానీ ఆయన మార్గం హింసాయుతం. మతంతో పెనవేసుకుపోయిన జీవితం ఆయనది. మతం మానవ కల్యాణమే కోరేదయితే ఆయన మతం అందుకు విరుద్దం. ఎందుకంటే ఆయన సాటి మనుషులందరినీ ఒకే రకంగా చూడలేరు. మరో మతం వారన్నఒకే ఒక్క కారణంగా ఆయన మనుషులను మనుషులుగా చూడకుండా ఉండగలరు.

యోగీ ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువవాహిని చరిత్ర మొత్తం పరమత అసహనమే. ఆ అసహనాన్ని ప్రకటిచేందుకు యువవాహిని సభ్యులు ఎంచుకున్న మార్గం బెదిరింపులు, వేధింపులు, భౌతిక దాడులు. దానికి మార్గ దర్శకుడు యోగీ ఆదిత్యనాథ్.

యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ మఠం అధిపతిగా ఉన్నంతవరకూ చట్టం మీద ఆయనకున్న గౌరవం అగౌరవంతో ప్రజలకు నిమిత్తం లేదు (దానివల్ల ఎవరికైనా ఇబ్బందులు కలగనంత వరకూ). ఎందుకంటే ఆయన మాటలు, చేష్టలు చట్ట వ్యతిరేకంగా ఉంటే ఆ సంగతి సంబంధిత యంత్రాంగం చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో చట్టబద్ధ పాలన అమలు యంత్రాంగానికి అధిపతి.

నిజానికి సామాన్య పౌరుడయినా, ముఖ్యమంత్రి అయినా చట్టం ఒకే రకంగా వర్తించాలి. ప్రజాస్వామ్యంలోని గొప్పతనమే అది. కానీ ఆదిత్యనాథ్ లాంటి వారికి వారు సామాన్యపౌరులుగా ఉన్నపుడు కూడా చట్టం అందరికీ వర్తించిన తీరులో వర్తించదు. ఇక్కడ ఆదిత్యనాథ్ లాంటి వారు అంటే రాజకీయనాయకులు అందరూ కాదు. మతం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇతర రాజకీయ నాయకుల కన్నా చాలా ఎక్కువ. ఇక వారు ముఖ్యమంత్రి పదవి వంటి ఉన్నతస్థానంలో ఉంటే! ఆలోచించడానికి కూడా భయపడాల్సినంత విషయం కదూ!

ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు అనుభవంలోకి వస్తున్నది అదే. ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు పెరిగాయి. చట్ట వ్యతిరేక శక్తులను ఏరిపారవేస్తాం తప్ప వారికి చట్టాన్ని వర్తిపజేయబోమని ఆయన ఖరాఖండీగా చెప్పారు. మానవహక్కుల కోసం తాపత్రయపడే కొద్ది మంది మినహా ఎవరూ నోరు మెదపలేదు. ఆ భూతం చూస్తుండగానే పెరిగి పెద్దదయిపోయింది. గోమాత సంరక్షణ పేరుతో ముస్లింలను దారుణంగా కొట్టి చంపడాలు మొదలయ్యాయి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఆదిత్యనాథ్‌కు చీమ కుట్టినట్లయినా లేకపోయింది. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ తప్పక ఒకసారి నోరు విప్పారు గానీ  ముఖ్యమంత్రి నోట ఖండన అన్నది రాలేదు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో యోగి మార్కు అరాచకానికి బులంద్‌శహర్ ఘటన చక్కటి తార్కాణం. ఆవుల కళేబరాలు దొరికాయన్న కారణంగా చెలరేగిన బులంద్‌శహర్‌ హింసాకాంఢలో ఒక పోలీసు అధికారిని ఆయన తుపాకితోనే కాల్చి చంపితే ముఖ్యమంత్రికి ఆ దారుణ హత్య కాకుండా ఆవుల కళేబరాలే ముఖ్యమయ్యాయి. ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఇలాంటి విషయాల్లో ఆదిత్యనాథ్ ప్రతిపక్షాల విమర్శలను కూడా పట్టించుకోరు.

ఇంత జరిగిన తర్వాత కూడా ఆదిత్యనాథ్ తీరు మారలేదు. తాజాగా ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో మానవహక్కుల సంరక్షణ ప్రాధమ్యాలు ఎలా ఉండేదీ వివరించారు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచీ ఉన్నది అదే పరిస్థితి. అయినా మళ్లీ ఒకసారి స్పష్టం చేయదలచుకున్నారంటే అందుకు కారణం ఏదో ఉంటుంది. ఇటీవలి పరిణామాలతో, ముప్పేట వస్తున్న విమర్శలతో ఆయన ఇంకాస్త మొండి తేలారు అన్న కారణం కాక ఇంకేమీ కనబడడం లేదు.

మానవహక్కులు సామాన్యులకే కానీ నేరస్థులకు కాదని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. నేరస్థులు ఎవరు అన్నది ఎవరు ఎలా నిర్ధారిస్తారు? నేరస్థులుగా న్యాయస్థానం నిర్ధారించిన తర్వాత కూడా వారికి మానవహక్కులు ఉంటాయని ఆదిత్యనాథ్‌కు తెలియదా? మనిషి అన్నవాడికి బతికిఉన్నంత కాలం మానవహక్కులు ఉంటాయని ఆయనకు తెలియదా? చక్కగా తెలుసు. హిందూ ఆధిక్యతావాదానికి తలొగ్గకపోతే ముస్లింలకు మానవహక్కులు నిరాకరించగల భావజాలానికి యోగి అసలు సిసలు ప్రతినిధి. అలాంటి వ్యక్తి నుంచి  మానవహక్కులపై గౌరవం ఆశించడమే తప్పు. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నాడే! ఆ కుర్చీలో కూర్చుని చట్ట బద్ధ పాలనపై ప్రత్యక్షంగా దాడి చేస్తూఉంటే ఎంతకాలం చూస్తూ ఉండడం?

ఆలపాటి సురేశ్ కుమార్