ప్రాణాలు కాపాడిన యాక్సిడెంట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవటమో, క్షతగాత్రులై ఆస్పత్రి పాలవటమో జరుగుతుంది. కానీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం.. ముగ్గురి ప్రాణాలను కాపాడింది. ఆరిజోనా రాజధాని ఫీనిక్స్ నగరంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని స్ధానిక పోలీసుశాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.


ఓ జంట తమ చిన్నారిని ట్రోలర్‌లో కూర్చొబెట్టుకుని నాలుగు రోడ్లుగల సర్కిల్‌లో రోడ్డును దాటుతున్నారు. ఓ మార్గంలో రెడ్‌ సిగ్నల్‌ పడింది. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో వీరు రోడ్డు దాటే ప్రయత్నం చేసారు. ఇంతలోనే ఓ జీపు అతి వేగంతో ప్రయాణిస్తూ రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా రోడ్డు దాటి వారిని ఢీకొట్టబోయింది. అదే సమయంలో వీరి ఎదురు నుంచి వచ్చిన మరో కారు వేగంగా వస్తున్న ఇవతలి కారును ఢీ కొట్టింది. దీంతో వీరిని ఢీ కొట్టాల్సిన కారుతో సహా రెండు కార్లు పక్కకు వెళ్లిపోయాయి. దీంతో రెప్పపాటులో దంపతులు వారి చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెండు కార్లలోని వారికి స్వల్పగాయాలయ్యాయి. జంటను ఢీకొట్టడానికి వెళ్లిన కారును నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను ఫీనిక్స్ పోలీసులు ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..ట్రాఫిక్ సిగ్నల్స్ గమనించి, రూల్స్ పాటించకపోతే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు.